Team India: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కు కరోనా పాజిటివ్... విండీస్ తో టీ20 సిరీస్ కు డౌటే!

  • ఇటీవలే గాయం నుంచి కోలుకున్న రాహుల్
  • మరో రెండ్రోజుల్లో ఫిట్ నెస్ టెస్టు
  • అంతలోనే కరోనా బారినపడిన వైనం
  • జులై 29 నుంచి వెస్టిండీస్ తో టీ20 సిరీస్
Team India opener KL Rahul tested corona positive

ఇటీవల గాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు దూరమైన కేఎల్ రాహుల్ తాజాగా కరోనా బారినపడ్డాడు. ఈ టీమిండియా ఓపెనర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో, త్వరలో వెస్టిండీస్ తో జరిగే టీ20 సిరీస్ లో రాహుల్ ఆడేది అనుమానంగా మారింది. ముంబయిలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిన సందర్భంగా బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ మేరకు ప్రకటన చేశారు. 

ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్న కేఎల్ రాహుల్ విండీస్ తో టీ20 సిరీస్ ఆడే టీమిండియాకు ఎంపికయ్యాడు. అయితే, కరోనా టెస్టులో పాజిటివ్ రావడంతో అతడు వెస్టిండీస్ వెళ్లే విషయంపై అనిశ్చితి నెలకొంది. వాస్తవానికి, గాయం నుంచి కోలుకున్న రాహుల్ మరో రెండ్రోజుల్లో ఫిట్ నెస్ టెస్టులో పాల్గొనాల్సి ఉంది. కరోనా సోకిన నేపథ్యంలో అతడికి ఫిట్ నెస్ పరీక్ష నిర్వహించే అవకాశాలు కనిపించడంలేదు. 

జులై 29 నుంచి వెస్టిండీస్ తో టీమిండియా టీ20 సిరీస్ షురూ కానుంది. అప్పట్లోగా రాహుల్ కోలుకుని, ఫిట్ నెస్ టెస్టుకు హాజరయ్యే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. 

అటు, బ్రిటన్ లో జరిగే క్వామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టులోనూ కరోనా కలకలం రేగిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. అయితే కరోనా బారినపడిన మహిళా క్రికెటర్ పేరు మాత్రం బహిర్గతం చేయలేదు.

More Telugu News