సోనియా ఈడీ విచార‌ణ‌పై గొంతెత్తి నిన‌దించిన రేవంత్‌... ఫొటోలు, వీడియో ఇవిగో

21-07-2022 Thu 18:35
  • సోనియా ఈడీ విచార‌ణ‌కు నిర‌స‌న‌గా టీపీసీసీ భారీ ర్యాలీ
  • పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చిన పార్టీ శ్రేణులు
  • న‌లుపు రంగు చొక్కా, ప్యాంటులో వ‌చ్చిన రేవంత్ రెడ్డి
revanth sloguns agaist union government
నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌ జరపడంపై గురువారం ఆ పార్టీ శ్రేణులు దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాయి. ఇందులో భాగంగా ఆ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) హైద‌రాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వ‌హించింది. ఈ ర్యాలీకి పార్టీ శ్రేణుల నుంచి ఊహించ‌ని మ‌ద్ద‌తు ల‌భించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీకి త‌ర‌లివ‌చ్చాయి.

ర్యాలీ అనంత‌రం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు ధ‌ర్నాకు దిగాయి. ఈ సంద‌ర్భంగా సోనియా, రాహుల్‌ల‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన కీల‌క నేత‌ల‌పై కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని రేవంత్ ఆరోపించారు. న‌లుపు రంగు చొక్కా, ప్యాంట్‌తో ద‌ర్శ‌న‌మిచ్చిన రేవంత్ ఓ ఉద్య‌మ‌కారుడి మాదిరిగా కేంద్రం తీరును నిర‌సిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి గొంతెత్తి నిన‌దిస్తున్న నేప‌థ్యంలో పార్టీ శ్రేణులు కూడా హుషారుగా కేంద్రానికి వ్య‌తిరేకంగా నినాదాల హోరును వినిపించారు.