Nadendla Manohar: రామాయపట్నం పోర్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం ముందుకెళుతున్న తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి: నాదెండ్ల

Nadendla Manohar questions YCP Govt on Ramayapatnam Port
  • రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ భూమిపూజ
  • విమర్శనాస్త్రాలు సంధించిన నాదెండ్ల
  • ఎందుకు నాన్-మేజర్ పోర్టుగా నోటిఫై చేశారని ప్రశ్నించిన వైనం
ఏపీ సీఎం జగన్ రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసి, పైలాన్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శనాస్త్రాలు సంధించారు. రామాయపట్నం పోర్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం ముందుకెళుతున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. 

ఈ పోర్టు ద్వారా ఊహించని విధంగా పెట్టుబడులు వస్తాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ చెబుతున్నారని, అయినప్పటికీ సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. ఎందుకంటే, జగన్ చిత్తశుద్ధి ఏపాటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యంగ్యంగా అన్నారు. 

రామాయపట్నం పోర్టు పనులు 2021లో ప్రారంభమై 2023 నాటికి పూర్తవుతాయని స్వయంగా సీఎం ప్రకటించారని తెలిపారు. పోర్టు నిర్మాణానికి 3,634 ఎకరాల భూమి అవసరం కాగా, ఫేజ్-1 కింద ఈ ప్రభుత్వం ఇప్పటివరకు సేకరించింది 255 ఎకరాలేనని నాదెండ్ల వెల్లడించారు. 10 శాతం భూసేకరణను కూడా ప్రభుత్వం పూర్తిచేయలేదని విమర్శించారు.

అంతేకాదు, ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం కేంద్ర ప్రభుత్వమే ఏపీలో మేజర్ పోర్టు నిర్మించేందుకు ప్రతిపాదన చేసిందని, దుగరాజపట్నం, రామాయపట్నంలలో ఒకదాన్ని ఎంచుకోవాలని చెప్పిందని వివరించారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా తామే పోర్టు నిర్మిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని తెలిపారు. కానీ, రామాయపట్నంను ఏపీ ప్రభుత్వం నాన్-మేజర్ పోర్టుగా నోటిఫై చేయడం ఏంటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. మేజర్ పోర్టుగా నోటిఫై చేసుంటే విభజన చట్టం మేరకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చుతో పోర్టు నిర్మించి ఉండేదని పేర్కొన్నారు. 

రామాయపట్నం పోర్టులో మౌలిక సదుపాయాల కల్పన, పోర్టు పనుల వేగవంతం కోసం మారిటైమ్ బోర్డు స్థాపించారని వెల్లడించారు. పోర్టు నిర్మాణం కోసం రూ.2,079 కోట్లు అవసరం కాగా, అందులో ప్రభుత్వ వాటా రూ.1,450 కోట్లు అని వివరించారు. తన వద్ద అంత నిధులు లేకపోవడంతో ప్రభుత్వం గంగవరం పోర్టులో తన వాటా అమ్ముకుందని, దాంతో రూ.650 కోట్లు వచ్చాయన్నారు. అలాగే, మత్స్యకారుల ఫిషింగ్ హార్బర్ల కోసం రూ.350 కోట్లు సేకరించారని తెలిపారు. మొత్తం రూ.1000 కోట్ల మేర సమీకరించిన ఆ నిధులు ఇప్పుడేమయ్యాయని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. 

కడప స్టీల్ ప్లాంట్ కు రామాయపట్నం పోర్టులో కేటాయించిన బెర్తులకు సంబంధించిన అవగాహన ఒప్పందం మరో రెండేళ్లలో ముగియనుందని, ఇప్పటికీ ఆ ప్రాజెక్టులు మొదలుకాలేదని వివరించారు. రామాయపట్నం పోర్టుకు ఫైనాన్షియల్ క్లోజర్ లేకుండానే శంకుస్థాపన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
Nadendla Manohar
Ramayapatnam Port
YCP Govt
CM Jagan
Andhra Pradesh

More Telugu News