Teeth: దంతాలు బాగుండాలంటే ఈ ఏడు డ్రింక్స్​ తో జాగ్రత్తగా ఉండాల్సిందే.. నిపుణులు చెప్పే సూచనలివీ

  • మారుతున్న ఆహార అలవాట్లతో పెరుగుతున్న దంత సమస్యలు
  • పళ్లను కాపాడుకునేందుకు చాలా మంది తంటాలు
  • చక్కెర, యాసిడ్ లక్షణం ఉండే పానీయాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు
  • అవసరమైతే స్ట్రాల వంటివి ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుందని వెల్లడి 
If you want to have good teeth you have to be careful with these seven drinks experts say

పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయేదాకా తరచూ ఏదో ఒకటి తాగుతుంటాం. ఇంట్లో ఉన్నప్పుడు టీ, కాఫీ, జ్యూస్ల వంటివి.. బయటికి వెళ్తే కూల్ డ్రింకుల నుంచి ఇతర ద్రవాల దాకా ఎన్నో తీసుకుంటూ ఉంటాం. వీటిలో చాలా వరకు మన దంతాలకు హాని కలిగించేవేనని నిపుణులు చెబుతున్నారు. కేవలం పళ్లను శుభ్రంగా తోముకోవడమే కాకుండా.. మనం తీసుకునే ఆహారం, పానీయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటేనే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

నిర్లక్ష్యంతో సమస్యలెన్నో..
దంతాల విషయంలో నిర్లక్ష్యం చేస్తే.. గారపట్టి నల్లగా అవడం, నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధులు వంటివి తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం తీసుకునే ద్రవాహారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే పళ్లను కాపాడుకోవచ్చని అంటున్నారు. కొన్ని రకాల డ్రింక్స్ మాత్రం దంతాలకు చాలా హానికలిగిస్తాయని.. వాటి విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఏడు రకాల డ్రింక్స్, వాటితో ఉండే ఇబ్బందులేమిటో వివరిస్తున్నారు.

1. యాసిడ్, చక్కెర పదార్థాలున్న డ్రింక్స్
దంతాలపైన పొరలో ఉండే ఎనామిల్ వల్లే దంతాలకు దృఢత్వం వస్తుంది. ఎనామిల్ దృఢంగా ఉన్నంత వరకు దంతాలకు రక్షణ ఉంటుంది. అంత కీలకమైన ఎనామిల్ ను రక్షించుకోవడం అత్యంత ముఖ్యం. అయితే అతిగా చక్కెర, యాసిడ్ లక్షణాలు ఉన్న డ్రింక్స్ తో ఎనామిల్ పొర దెబ్బతింటుంది. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ లో పలు రకాల యాసిడ్లు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

‘‘ఎసిడిక్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల దంతాలపై ఎనామిల్ పొర మెత్తబడుతుందని పరిశోధనల్లో తేలింది. అందువల్ల దంతాలు సెన్సిటివ్ గా మారుతాయి. ఏ మాత్రం ఒత్తిడి పడినా దెబ్బతింటాయి. ఇక అతిగా చక్కెర ఉన్న పదార్థాల కారణంగా దంతాల మధ్య సందులు, చిగుళ్లలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అవి విడుదల చేసే యాసిడ్లు దంతాలను దెబ్బతీస్తాయి..” అని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజనీకుమార్ పాఠక్ తెలిపారు.

2. డైట్ సోడా
సాధారణంగా ఎలాంటి చక్కెర లేకుండా ఉండే డైట్ సోడాలను కొందరు తాగుతుంటారు. వాటితో ప్రమాదం ఉండదని భావిస్తుంటారు. కానీ ఈ సోడాల్లోనూ యాసిడ్ పదార్థాలు ఉంటాయని.. దంతాలను దెబ్బతీస్తాయని నిపుణులు చెప్తున్నారు.

3. పళ్ల రసాలు
పళ్ల రసాలు శరీరానికి ఎంతో ఆరోగ్యకరమన్న విషయంలో ఏ సందేహమూ లేదు. కానీ నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి సిట్రస్ జాతి పళ్ల రసాల్లో యాసిడ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అవి దంతాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందువల్ల పళ్ల రసాలను స్ట్రాతో తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

4. స్పోర్ట్స్, ఎనర్జీ డ్రింక్స్
శరీరం బాగా అలసిపోయినప్పుడు తక్షణ శక్తి కోసం స్పోర్ట్స్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు తాగుతుంటారు. వాటిలో అత్యధిక స్థాయిలో చక్కెరలు ఉంటాయని.. దానికితోడు కృత్రిమ రంగులు కలుపుతారని అవి దంతాలకు హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రింక్స్ వల్ల దంతాలు రంగు మారిపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

5. టీ, కాఫీలు
టీ, కాఫీ వంటివి అతిగా తాగుతుంటే దీర్ఘకాలంలో దంతాలపై ఎనామిల్ దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. తక్కువ చక్కెర వేసుకొని తీసుకోవడం వల్ల ఇటు దంతాలకు, అటు శరీరానికి కొంత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. టీ, కాఫీలు ఎక్కువగా తాగేవారికి దంతాలు పసుపు రంగులోకి మారే అవకాశమూ ఉంటుందని వివరిస్తున్నారు.

6. ఆల్కహాల్
ఆల్కహాల్ కూడా దంతాలను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటిలో చిగుళ్లు దెబ్బతిని వివిధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

7. బాటిల్ నీళ్లు
బాటిళ్లలో నింపి విక్రయించే మంచి నీళ్లలో చాలా వరకు స్వల్పంగా ఎసిడిటిక్ లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రుచి కోసం కంపెనీలు పలు రకాల పదార్థాలు కలపడమే దీనికి కారణమని అంటున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి..
దంతాల ఆరోగ్యం బాగుండాలంటే రోజూ పొద్దున, రాత్రి నిద్రించే ముందు బ్రష్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా తిన్నాక, తాగిన తర్వాత వెంటనే మంచి నీటితో నోటిని పుక్కిలించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.

ఇక దంతాలు తెల్లగా కావడానికి తోడ్పడుతాయనుకునే వివిధ రకాల ఉత్పత్తులు ఎనామిల్ పొరను దెబ్బతీస్తాయని, అందువల్ల వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏవైనా తీపి, కార్బోనేటెడ్ పానీయాలను తీసుకునే సమయంలో.. స్ట్రాలను ఉపయోగించడం వల్ల దంతాలపై పడే ప్రభావాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

More Telugu News