Lok Sabha: లోక్‌స‌భ‌లో వైసీపీ ఎంపీలు ర‌ఘురామ‌కృష్ణరాజు, మార్గాని భ‌ర‌త్‌ల మ‌ధ్య వాగ్వివాదం

  • మ‌ద్యం ఆదాయాన్ని కార్పొరేష‌న్‌కు త‌ర‌లిస్తున్నారన్న ర‌ఘురామ‌
  • ఏపీలో శ్రీలంక త‌ర‌హా ఆర్థిక ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఆరోప‌ణ‌
  • ఆధారాలు లేకుండా అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు స‌రికాద‌న్న మార్గాని భ‌ర‌త్‌
  • భ‌ర‌త్‌తో క‌లిసి ర‌ఘురామ‌కు వ్య‌తిరేకంగా వైసీపీ ఎంపీల నినాదాలు
  • పానెల్ స్పీక‌ర్ ప‌దే ప‌దే వారించ‌డంతో స‌ద్దుమ‌ణిగిన వివాదం
row between ysrcp mps in lok sabha

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో భాగంగా గురువారం లోక్ స‌భలో ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన ఇద్ద‌రు ఎంపీల మ‌ధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న అప్పులు, నిధుల దారి మ‌ళ్లింపుపై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మాట్లాడుతుండ‌గా... అదే పార్టీకి చెందిన మ‌రో ఎంపీ మార్గాని భ‌ర‌త్ ఆయ‌న ప్ర‌సంగానికి అడ్డు త‌గిలారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు స‌భ్యుల‌ను శాంతింప‌జేసేందుకు స్పీక‌ర్ స్థానంలోని పానెల్ స్పీక‌ర్ రాజేంద్ర అగ్ర‌వాల్ శ్ర‌మించాల్సి వ‌చ్చింది.

తొలుత ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై ర‌ఘురామరాజు మాట్లాడుతూ మ‌ద్యం ఆదాయాన్ని బేవ‌రేజెస్ కార్పొరేష‌న్‌కు ఏపీ ప్ర‌భుత్వం మ‌ళ్లిస్తోంద‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానాలో జ‌మ చేయాల్సిన సొమ్ముల‌ను కార్పొరేష‌న్‌కు మ‌ళ్లించ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని ఆయ‌న స‌భ దృష్టికి తీసుకువ‌చ్చారు. మద్యం ఆదాయాన్ని మ‌ళ్లిస్తున్న అంశంపై కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. ఈ సంద‌ర్భంగా ఏపీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో శ్రీలంక త‌ర‌హా ఆర్థిక ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఇటీవ‌ల కేంద్రం చెప్పిన అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను గ‌మ‌నించాల‌ని ఆయ‌న కోరారు. 

ఈ సంద‌ర్భంగా ర‌ఘురామ రాజు ప్ర‌సంగాన్ని రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మార్గాని భ‌ర‌త్ అడ్డుకున్నారు. ఆధారాలు లేకుండా అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేయొద్ద‌ని ఆయ‌న ర‌ఘురామ‌ను వారించారు. ఈ సంద‌ర్భంగా మార్గాని భ‌ర‌త్‌తో క‌లిసి వైసీపీ ఎంపీలు ర‌ఘురామ‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ ఎంపీల నినాదాల హోరు పెర‌గ‌డంతో ర‌ఘురామ వారిపైపు చూడ‌గా... ఆయ‌న‌తో మార్గాని భ‌ర‌త్ వాగ్వివాదానికి దిగారు. ర‌ఘురామ కూడా మార్గాని భరత్ కు బ‌దులిస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు పానెల్ స్పీక‌ర్ ప‌దే ప‌దే సూచించడంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది.

More Telugu News