Falling rupee: ఎటు చూసినా ధరల మోతే.. రూపాయి క్షీణతతో మోయలేని భారం

  • పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
  • నిత్యావసరాలకు రెక్కలు
  • గ్యాస్ నుంచి, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల వరకు అన్నీ భారమే
  • రూపాయి విలువ క్షీణతతో విదేశీ విద్యార్థులకు కష్టకాలం
Falling rupee and inflation Common mans demons

ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. పెరుగు, మజ్జిగ, టెట్రా ప్యాక్ లలో పానీయాలు, 25 కిలోల వరకు పరిమాణంలో ఉండే ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు, పిండులపై 5 శాతం జీఎస్టీ అమల్లోకి వచ్చింది. మరోవైపు డాలర్ తో రూపాయి మారకం 80కు పడిపోయింది. దీంతో దిగుమతి చేసుకునే వాటి ధరలు పెరిగి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ధరల కాక చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 

ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకం విలువ క్షీణత ఈ రెండూ అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం. కానీ, నిత్యావసరాలపై 5 శాతం జీఎస్టీ బాదుడు అన్ని రాష్ట్రాలు కలసి జీఎస్టీ కౌన్సిల్ లో తీసుకున్న ఉమ్మడి నిర్ణయం. తిలా పాపం తలా పిడికెడు అన్న తీరులో కారణాలైవేనా కానీ, ఇప్పుడు మధ్యలో నలిగిపోతున్నది మాత్రం సామాన్య, మధ్యతరగతి ప్రజలే.

విదేశీ చదువులు భారం
డాలర్ తో రూపాయి 80కు పడిపోవడం వల్ల విదేశీ చదువులు భారంగా మారాయి. భారత్ నుంచి ఏటా 20 లక్షల మంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు ప్రయాణమవుతుంటారు. ఇప్పుడు వీరంతా అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వారు జీవనం కోసం ఖర్చు చేసేది, ఫీజులు చెల్లించేది డాలర్లలో. ఆ డాలర్లను రూపాయిలతోనే మారకం చేసుకోవాల్సి ఉంటుంది. ఆరు నెలల క్రితం డాలర్ తో రూపాయి రూ.74 వద్ద ఉంది. ఇప్పుడు రూ.80కు తగ్గింది. డాలర్ తో రూపాయి తగ్గింది 9 శాతమే కనుక.. ఫీజుల భారం కూడా 9 శాతమే పెరిగి ఉంటుందని పొరపడొద్దు. విదేశాల్లోనూ ద్రవ్యోల్బణం కాక ఉందని మర్చిపోవద్దు. కనుక భారం ఎంత లేదన్నా 30-50 శాతం వరకు ఉంటుందని అంచనా.

విద్యా రుణాలు 
విదేశీ విద్య కోసం రుణం తీసుకుని వెళ్లిన వారి పరిస్థితి కూడా ఇంతే. ఒకవైపు పెరుగుతున్న రుణ రేట్ల భారాన్ని, మరోవైపు రూపాయి పతన ప్రభావాన్ని మోయాల్సిందే. ఒక విద్యార్థికి చదువుల ఫీజులు, జీవన వ్యయాలు, రుణ రేట్లు అన్నీ కలసి తడిసి మోపెడు కానున్నాయి.

విదేశీ ప్రయాణాలు
విదేశీ ప్రయాణాల చార్జీలు కూడా భారీగా పెరిగిపోయాయి. గతేడాది అమెరికాకు ఒకవైపు ఎయిర్ లైన్ చార్జీ రూ.50వేల వరకు ఉంటే అది ఇప్పుడు రూ.లక్ష అయింది. 

రుణాలు భారం
నేడు అడగకపోయినా బాబ్బాబు అంటూ రుణాలు ఇచ్చే సంస్థలు బోలెడు వచ్చేశాయి. దీంతో వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాల వినియోగం భారీగా పెరిగిపోయింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లను మే, జూన్ లో 0.90 శాతం మేర పెంచింది. దీంతో రుణ రేట్లు కూడా ఇంతే మేర పెరిగాయి. ఫలితంగా గృహ రుణాలు తీసుకున్న వారు కూడా ప్రతి నెలా అదనంగా చెల్లించాల్సి పరిస్థితి ఏర్పడింది. 

ప్రయాణాలు భారం
మనం వినియోగించే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ఏటీఎఫ్ వీటన్నింటికీ మూలమైన ముడి చమురును 85 శాతం దిగుమతి చేసుకోవాల్సిందే. వీటి కోసం ఇప్పుడు ఎక్కువ రూపాయిలు చెల్లించుకోవాలి. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వీటి రూపేణా ప్రతి నెలా అదనంగా ఖర్చు చేయక తప్పదు. డీజిల్ తో నడిచే బస్సు ప్రయాణాల చార్జీలు కూడా గత ఆరు నెలల్లో ఏ స్థాయిలో పెరిగాయో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. పెరిగిపోయిన ఏటీఎఫ్ చార్జీలతో విమాన టికెట్ల చార్జీలకు కూడా రెక్కలు వచ్చాయి. 

నిత్యావసరాలు
బయటకు వెళ్లి టిఫిన్ చేద్దామన్నా, భోజనం చేయాలన్నా, బిర్యానీ తినాలన్నా జేబు నుంచి అధికంగా చెల్లించక తప్పదు. ఎందుకంటే పెరిగిన గ్యాస్ ధరలు హోటళ్లు, రెస్టారెంట్లపై పడుతుంది. దీనికితోడు ఇటీవలే 25 కిలోల వరకు పరిమాణంలో విక్రయించే ప్యాకేజ్డ్ పిండులు (శనగపిండి, గోధుమ పండి, మైదా పిండి), రవ్వలు, గోధుమలు, బియ్యం ఇలా అన్నింటిపైనా కొత్తగా 5 శాతం జీఎస్టీ పడింది. టిఫిన్ బండ్లు ఎక్కువగా 25 కిలోల లోపే వినియోగిస్తుంటారు. వీరు పెరిగిన ధరల భారాన్ని వినియోగదారులపై బాదక తప్పదు. అంతేకాదు, సామాన్యులు కూడా నిత్యావసరాలను తక్కువ పరిమాణంలోనే కొనుగోలు చేస్తుంటారు. ఆ రూపంలోనూ ఇది భారం కానుంది.

More Telugu News