Biological E: హైదరాబాద్​ లో రూ.1800 కోట్లతో ‘బయోలాజికల్​ ఇ’ విస్తరణ

 Biological E in announces its expansion in Genome Valley
  • మంత్రి కేటీఆర్ తో సమావేశం తర్వాత ప్రకటించిన కంపెనీ
  • జీనోమ్ వ్యాలీలో విస్తరణ చేస్తామని తెలిపిన ఫార్మా దిగ్గజం
  • 2500 మందికి ఉపాధి కలుగుతుందని ప్రకటన
హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘బయోలాజికల్ ఇ’ నగరంలోని జీనోమ్ వ్యాలీలో తమ కంపెనీని విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలోని తమ ప్లాంటులో రూ. 1800 కోట్ల పెట్టుబడితో 2500 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో గురువారం సమావేశమైన తర్వాత ఈ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తాజా పెట్టుబడితో జాన్సెన్ కోవిడ్ వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్, పిసివి వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సైడ్ ఆంపౌల్స్, బయోలాజికల్ ఎపిఐలు, ఫార్ములేషన్స్ మొదలైన వాటి తయారీపై దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపింది.

జీనోమ్ వ్యాలీలో ‘బయోలాజికల్ ఇ’ విస్తరణను ప్రకటించడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విస్తరణ 14 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే ప్రపంచంలోని ఏకైక ప్రాంతంగా హైదరాబాద్‌ను మార్చిందన్నారు. హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా పేరుగాంచిందన్నారు. ‘బయోలాజికల్ ఇ’ విస్తరణతో దీనికి మరింత బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ‘బయోలాజికల్ ఇ’ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.
Biological E
genome valley
Hyderabad
KTR

More Telugu News