'మహాసేన' రాజేశ్ ను వేధించడం దారుణం: చంద్రబాబు

21-07-2022 Thu 12:17
  • ఏపీలో దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయన్న చంద్రబాబు 
  • దళితులను ఆదుకోవాలన్నందుకు రాజేశ్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపణ  
  • అతని వాహనాలను కూడా లాక్కున్నారని మండిపాటు 
Chandrababu demands to stop harassing Mahasena Rajesh
ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని చెపుతూ... దళితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినందుకు కాకినాడకు చెందిన మహాసేన మీడియా నిర్వాహకుడు రాజేశ్ మీద అక్రమ కేసులు పెట్టి, శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధించడం దారుణమని అన్నారు.

దళితులకు రాష్ట్రంలో రక్షణ లేదనడానికి మహాసేన రాజేశ్ ఉదంతమే నిదర్శనమని చెప్పారు. పోలీసులు అతని నుంచి వాహనాలను లాక్కున్నారని... వాహనాలను లాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాజేశ్ విషయంలో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నానని చెప్పారు. ఇకనైనా రాజేశ్ పై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకుని, అతనిపై వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు.