Sharad Pawar: శివసేనలో తిరుగుబాటు నేపథ్యంలో శరద్ పవార్ సంచలన నిర్ణయం.. ఎన్సీపీకి చెందిన అన్ని విభాగాలు, సెల్స్ రద్దు!

  • అన్ని విభాగాలను రద్దు చేసినట్టు ప్రకటించిన ప్రఫుల్ పటేల్
  • ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడి
  • మహిళ, యూత్, విద్యార్థి విభాగాలు మాత్రం కొనసాగుతాయన్న పటేల్
Sharad Pawar Dissolves All Units Of Party

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ ఎన్సీపీకి చెందిన అన్ని విభాగాలు, సెల్స్ ను రద్దు చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. ట్విట్టర్ ద్వారా ప్రఫుల్ పటేల్ స్పందిస్తూ... తమ అధినేత శరద్ పవార్ ఆదేశాలతో పార్టీకి చెందిన అన్ని విభాగాలు, సెల్స్ ను రద్దు చేశామని తెలిపారు. అయితే, నేషనలిస్ట్ విమెన్స్ కాంగ్రెస్, నేషనలిస్ట్ యూత్ కాంగ్రెస్, నేషనలిస్ట్ స్టూడెంట్స్ కాంగ్రెస్ విభాగాలు మాత్రం కొనసాగుతాయని చెప్పారు.  ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. అయితే ఇంత సడన్ గా ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారనే విషయాన్ని మాత్రం ప్రఫుల్ పటేల్ వెల్లడించలేదు. 

మరోవైపు, శివసేన పార్టీని రెబెల్స్ ముక్కలు చేసిన రోజుల వ్యవధిలోనే శరద్ పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. శివసేన నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను తీసుకొచ్చిన ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, శివసేన పార్టీ కూడా తమదేనని ఆయన అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా శరద్ పవార్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

More Telugu News