పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చైతూ!

21-07-2022 Thu 11:18
  • పోలీస్ పాత్రలపై మళ్లీ పెరుగుతున్న మోజు
  • 'ది వారియర్' లో పోలీస్ గా కనిపించిన రామ్
  • ఆశించిన స్థాయిలో కనిపించని రెస్పాన్స్  
  • వెంకట్ ప్రభు సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చైతూ
Nagarjuna in Venkat Prabhu Movie
ఒకప్పుడు తెలుగు తెరపై పోలీస్ ఆఫీసర్ పాత్రల జోరు ఎక్కువగా ఉండేది. పోలీస్ పాత్రలో చేయడానికి హీరోలంతా ఉత్సాహాన్ని చూపించేవారు. తెలుగులో రాజశేఖర్ .. తమిళంలో సూర్య .. మలయాళంలో సురేశ్ గోపి పోలీస్ పాత్రల ద్వారానే మరింత పాప్యులర్ అయ్యారు. ఆ తరువాత కాలంలో పోలీస్ పాత్రల హవా తగ్గుతూ వచ్చింది. 
 
కానీ ఇటీవల కాలంలో మళ్లీ పోలీస్ పాత్రలపై మోజు పెరుగుతుందేమో అనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన 'ది వారియర్' సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా, రిజల్టు పరంగా చూసుకుంటే ఫరవాలేదు అనిపించుకుంది.

ఇక తాను కూడా వెంకట్ ప్రభు దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్ పాత్రనే చేస్తున్నట్టుగా తాజా ఇంటర్వ్యూలో చైతూ చెప్పాడు. ఈ సినిమాలో తన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అన్నాడు. సాధారణంగా చైతూని సాఫ్ట్ రోల్స్ లో చూడటానికే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. మరి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులు ఆయనను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.