YSRCP: ఏపీ చేసిన అప్పుల కంటే కేంద్రం చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయి: కేంద్రంపై వైసీపీ ఎంపీల మండిపాటు

  • ఒక దేశ పరిస్థితిని మరో దేశంలోని రాష్ట్రంతో ఎలా పోలుస్తారన్న వైసీపీ ఎంపీలు
  • శ్రీలంక జీడీపీ కంటే ఏపీ జీడీపీ ఎక్కువగా ఉందని వ్యాఖ్య
  • కేంద్రం చేసిన అప్పుల గురించి చూసుకోవాలని సూచన
YSRCP MPs comments on comparing AP with Sri Lanka

రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మొదట తన పరిస్థితిని చూసుకోవాలని వైసీపీ ఎంపీలు తలారి రంగయ్య, రెడ్డెప్ప, అయోధ్యరామి రెడ్డిలు అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చడమేంటని వారు అసహనం వ్యక్తం చేశారు. ఒక దేశ ఆర్థిక పరిస్థితిని మరో దేశంలోని రాష్ట్రంతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. ఏపీ చేసిన అప్పుల కంటే కేంద్రం చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయని... దీనికి కేంద్రం ఏం సమాధానం చెపుతుందని అన్నారు. 

ఏపీ ప్రభుత్వం చేసిన అప్పుల్లో ప్రతి రూపాయికీ లెక్క ఉందని వైసీపీ ఎంపీలు చెప్పారు. శ్రీలంకలో గత మూడేళ్లుగా వాణిజ్య ఎగుమతులు తగ్గుముఖం పడుతుంటే... ఏపీలో వాణిజ్య ఎగుమతులు పెరిగాయని అన్నారు. శ్రీలంక జీడీపీతో పోలిస్తే ఏపీ జీడీపీ ఎక్కువగా ఉందని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్న ఏపీని శ్రీలంకతో పోల్చడం సరికాదని అన్నారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత మూడేళ్లలో రూ. 1.65 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశామని చెప్పారు.  

పోలవరం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను గత టీడీపీ ప్రభుత్వం తీసుకుందని... ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో కూడా రాష్ట్రమే ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోందని తెలిపారు.

More Telugu News