కోటి రూపాయల ఖర్చుతో వృద్ధురాలిని అమెరికా నుంచి భారత్ కు తరలించారు... ఎందుకంటే...!

21-07-2022 Thu 07:13
  • తీవ్ర హృద్రోగంతో బాధపడుతున్న వృద్ధురాలు
  • వృద్ధురాలి స్వస్థలం బెంగళూరు
  • కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్న వైనం
  • అమెరికాలో వైద్యచికిత్సకు అధిక వ్యయం
  • దాంతో భారత్ తరలించిన కుటుంబ సభ్యులు
Most expensive air lift from US to India
అమెరికా నుంచి 67 ఏళ్ల వృద్ధురాలిని అత్యంత వ్యయప్రయాసలతో భారత్ కు తరలించారు. అందుకైన ఖర్చు కోటి రూపాయలంటే ఆశ్చర్యం కలగకమానదు. బెంగళూరుకు చెందిన వృద్ధురాలు ఓరెగాన్ రాష్ట్రంలో ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. ఆమె తీవ్ర హృద్రోగంతో బాధపడుతోంది. అక్కడే ఓ ఆసుపత్రిలో చేర్చినా ప్రయోజనం కనిపించలేదు. హృద్రోగం నయం కాకపోగా ఇతర అవయవాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. 

కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ తప్పనిసరి అయింది. అమెరికాలో వైద్య ఖర్చులు అధికంగా ఉండడంతో ఆ వృద్ధురాలిని, చవకగా ఆధునిక వైద్యం లభించే భారత్ కు తరలించాలని నిర్ణయించారు. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రితో సంప్రదింపులు జరపగా, చికిత్స అందించేందుకు ఆ ఆసుపత్రి సమ్మతించింది. దాంతో ఆ వృద్ధురాలిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా చెన్నై తీసుకువచ్చారు. 

మొత్తం 23 గంటల పాటు ప్రయాణం సాగింది. అందుకైన ఖర్చు రూ.1 కోటి. బెంగళూరులోని ఇంటర్నేషనల్ క్రిటికల్ కేర్ ఎయిర్ ట్రాన్స్ ఫర్ టీమ్ ఈ ప్రయాణ ఏర్పాట్లు చేసింది. ఆ వృద్ధురాలి కోసం అత్యాధునిక వైద్యసదుపాయాలున్న ప్రత్యేక విమానాన్ని ఎయిర్ అంబులెన్స్ గా వినియోగించారు. ఇందులోనే డయాలసిస్ యూనిట్, ఐసీయూ ఉన్నాయి. 

జులై 17న అమెరికా నుంచి బయల్దేరిన ఈ విమానం మార్గమధ్యంలో టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ఒకసారి ఆగింది. విమాన సిబ్బంది మారిన అనంతరం భారత్ కు పయనమైంది. ప్రస్తుతం ఆ వృద్ధురాలికి చెన్నై ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.