Vijayawada: నాని నాకు సొంత అన్నయ్య.. శత్రువేమీ కాదు: కేశినేని చిన్ని వివరణ

  • ఆడ‌వాళ్ల‌ను బ‌య‌ట‌కు లాగ‌డం స‌రికాద‌న్న చిన్ని
  • టీడీపీ ఆదేశిస్తే నాని విజ‌యం కోసం ప‌నిచేస్తాన‌ని వెల్ల‌డి
  • ప్ర‌స్తుతం త‌న కారుపై ఎలాంటి స్టిక్క‌ర్ లేద‌న్న ఎంపీ సోద‌రుడు
kesineni chinni clarity on a police complaint by his brother on his car

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని), ఆయ‌న సోద‌రుడు కేశినేని శివ‌నాథ్ (కేశినేని చిన్ని) మ‌ధ్య నెల‌కొన్న వివాదం ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తి రేకెత్తించింది. కేశినేని నానికి ప్ర‌భుత్వం జారీ చేసిన ఎంపీ స్టిక్క‌ర్‌ను త‌న కారుకు అంటించుకుని చిన్ని తిరుగుతున్న వైనంపై స్వ‌యంగా కేశినేని నాని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేశినేని చిన్ని భార్య జాన‌కిలక్ష్మీ పేరిట రిజిస్ట‌ర్ అయి ఉన్న ఆ కారు హైద‌రాబాద్‌లో తిరుగుతుండగా.. పట్టుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. తాజాగా ఈ వివాదంపై కేశినేని చిన్ని వివ‌ర‌ణ ఇచ్చారు.

బుధ‌వారం విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఇదో చిల్లర వివాదం అంటూ వ్యాఖ్యానించారు. త‌న వ్య‌క్తిగ‌త వివాదమే త‌ప్పించి ఇందులో రాజ‌కీయ కోణం ఏమాత్రం లేద‌ని ఆయ‌న అన్నారు. కేశినేని నాని త‌న‌కు స్వ‌యానా అన్నయ్య అని చెప్పిన చిన్ని.. త‌న‌కేమీ నాని శత్రువు కాద‌ని తెలిపారు. తానేమీ ఎంపీ టికెట్ కోర‌లేద‌ని కూడా ఆయ‌న తెలిపారు. టీడీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేస్తే నాని గెలుపు కోసం ప‌నిచేస్తాన‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఈ వివాదంతో టీడీపీకి ఎలాంటి సంబంధం లేద‌ని చిన్ని స్ప‌ష్టం చేశారు. 

ఇక త‌న‌పై కేశినేని నాని పోలీసుల‌కు చేసిన ఫిర్యాదుపై చిన్ని స్పందించారు. త‌న‌పై రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేయొచ్చు గానీ... ఇంట్లో ఆడ‌వాళ్ల‌ను బ‌య‌ట‌కు లాగ‌డం స‌రికాద‌ని చిన్ని వ్యాఖ్యానించారు. తాను విజ‌య‌వాడ‌లో ఏ ఒక్క వ్యాపార‌వేత్త‌ను బెదిరించ‌లేద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. తాను త‌ప్పు చేసి ఉంటే ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చి ఉండేది క‌దా? అని కూడా చిన్ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం త‌న కారుపై ఎలాంటి స్టిక్క‌ర్ లేద‌ని చిన్ని వివ‌ర‌ణ ఇచ్చారు.

More Telugu News