Power Nap: ఆఫీసులో నిద్ర వస్తోందా?.. నిలబడే కునుకు తీసే ‘న్యాప్ బాక్స్’ను రూపొందించిన జపాన్ సంస్థ

  • కాసేపు నిద్ర పోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందంటున్న పరిశోధనలు
  • ‘పవర్ న్యాప్’ తర్వాత ఉత్సాహంగా పనిచేసేందుకు వీలుంటుందని వెల్లడి
  • నిలువుగా ఉండటం వల్ల స్థలం వృధా వంటి సమస్యలూ ఉండవని వివరణ
japanese company develops nap boxes for office workers

పొద్దున్నే లేచి ట్రాఫిక్ లో పడి ఆఫీసుకు వెళుతుంటారు. ఒకదాని వెనుక ఒకటిగా తీరిక లేని పని.. అలసిపోవడంతో మధ్యలో నిద్ర వస్తుంటుంది. అసలే ఆఫీసు.. ఇంకా నిద్రేంటి? అనిపిస్తుంటుంది. కానీ కాసేపు చిన్న కునుకు తీస్తే.. అలసట అంతా పోయి చురుగ్గా పనిచేసుకోవచ్చు. ఇందుకు సౌకర్యవంతంగా ఉండే ‘న్యాప్ బాక్స్’లను జపాన్ లోని టోక్యోకు చెందిన కొయొజు ప్లైవుడ్ కార్పొరేషన్ సంస్థ రూపొందించింది.

  • శరీరానికి పూర్తి విశ్రాంతిని ఇచ్చేలా.. నిలబడే కునుకు తీయగలిగేలా వీటిని తయారు చేసింది. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత.. ఈ బాక్సుల్లో అలాగే నిలబడి నిద్ర పోవచ్చని తెలిపింది. 
  • ఈ న్యాప్ బాక్స్ లకు స్థానిక భాషలో ‘కమిన్ బాక్స్’లుగా పేరు పెట్టింది. ఇవి నిలువుగా ఉండి తక్కువ స్థలాన్ని ఆక్రమించడం వల్ల.. ఆఫీసులలో విలువైన స్థలం వృధా వంటి సమస్యలూ ఉండవని కంపెనీ పేర్కొంది.

‘పవర్ న్యాప్’కు అనుగుణంగా..
ఎక్కడైనా ఆఫీసులో నిద్ర అనగానే చోద్యంగా చూస్తారు. కానీ జపాన్ లో అలా కాదు.. ఉద్యోగులు ఆఫీసు సమయంలో కూడా పది, ఇరవై నిమిషాల పాటు నిద్ర పోవడానికి కంపెనీలు అనుమతిస్తుంటాయి. ఆ కాసేపు విశ్రాంతి వల్ల పునరుత్తేజం పొంది బాగా పనిచేస్తారనేది దీనికి కారణం. 

ఇలా కాసేపు నిద్రపోవడాన్ని ‘పవర్ న్యాప్’ అని పిలుస్తుంటారు. దీనివల్ల ఒత్తిడి, అలసట వంటివి తగ్గిపోతాయని.. ఉద్యోగులు పవర్ న్యాప్ తర్వాత ఉత్సాహంగా పని చేయగలుగుతారని పలు పరిశోధనల్లో కూడా వెల్లడైంది. ఇందుకు అనుగుణంగానే జపాన్ లో ఉద్యోగులు లంచ్ సమయంలోగానీ ఆ తర్వాత పని మధ్యలోగానీ పది, ఇరవై నిమిషాలు కునుకు తీస్తుంటారు. వారికి అనుగుణంగా ఉండేందుకు న్యాప్ బాక్స్ ల వంటివి అందుబాటులోకి వచ్చాయి.

More Telugu News