england: ఆఖరి వన్డేలో కన్నీళ్లు పెట్టుకున్న బెన్​ స్టోక్స్​.. ఓటమితో వీడ్కోలు పలికిన ఇంగ్లండ్​ ఆల్​ రౌండర్​

  • దక్షిణాఫ్రికాతో మంగళవారం చివరి వన్డే ఆడిన స్టోక్స్
  • ఐదు పరుగులకే ఔటైన ఇంగ్లండ్ ఆల్ రౌండర్
  • 62 పరుగుల తేడాతో ఓడిపోయిన ఇంగ్లండ్
Ben Stokes in tears for last ODI before retirement

అనూహ్యంగా వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అందరినీ ఆశ్చర్య పరిచాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో  భాగంగా మంగళవారం రాత్రి  సొంత నగరం అయిన డర్హమ్ లో  జరిగిన  తొలి మ్యాచ్‌ తో స్టోక్స్ ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. దాంతో, ఈ మ్యాచ్ లో స్టోక్స్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆఖరి మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా కొద్దిసేపు జట్టును నడిపించే అవకాశం ఇచ్చి స్టోక్స్ ను గౌరవించింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ). అయితే, తోటి ఆటగాళ్లతో కలిసి పిచ్ దగ్గరకు వచ్చినప్పుడు స్టోక్స్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

కానీ, ఈ మ్యాచ్ లో స్టోక్స్ ను దురదృష్టం వెంటాడింది. బ్యాటింగ్ లో తను కేవలం ఐదు పరుగులకే ఔటవగా.. ఇంగ్లండ్ 62 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దాంతో, స్టోక్స్ ఓటమితో వన్డేలకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఈ పోరులో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. రాసీ వాన్‌  (133) సెంచరీ చేయగా.. ఐడెన్ మార్ క్రమ్ (77), జానేమన్‌ మలన్‌ (57) అర్ధ శతకాలతో రాణించారు. దాంతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 46.5 ఓవర్లలోనే 271 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌(43), జానీ బెయిర్‌ స్టో(63), జో రూట్‌ (86) రాణించినప్పటికీ ఫలితం లేకపోయింది. బెన్‌ స్టోక్స్‌(5), జోస్‌ బట్లర్‌(12) నిరాశ పరిచారు. దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జ్ 8.5 ఓవర్ల బౌలింగ్‌లో 53 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జట్టును దెబ్బకొట్టాడు. 

More Telugu News