Team India: విండీస్‌తో వన్డే సిరీస్ కోసం ట్రినిడాడ్ చేరుకున్న భారత జట్టు.. వీడియో ఇదిగో

 Shikhar Dhawan led India arrive in Trinidad for 3 match ODI series against West Indies
  • ఈ నెల 22న ప్రారంభం కానున్న సిరీస్
  • దిగ్గజాలకు విశ్రాంతి కల్పించిన వైనం 
  • రోహిత్ గైర్హాజరీలో జట్టును నడిపించనున్న ధావన్
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు ట్రినిడాడ్ చేరుకుంది. ఈ నెల 22 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ నుంచి నేరుగా విండీస్ చేరుకున్న జట్టులో రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా వంటివారు లేకపోవడం గమనార్హం. వీరందరికీ ఈ సిరీస్‌లో విశ్రాంతి కల్పించారు. 

ఈ నెల 22 నుంచి 27 వరకు క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. రోహిత్ శర్మ గైర్హాజరీలో ధావన్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్‌తోపాటు వికెట్ కీపర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరికీ చోటు లభించింది. 

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో సెంచరీ బాదిన దీపక్ హుడా.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో విండీస్‌తో సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేశారు. కాగా, ఈ సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా రోహిత్, కోహ్లీ, బుమ్రా, షమీలకు విశ్రాంతినిచ్చారు. 

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఈ నెల 29, ఆగస్టు 7 మధ్య భారత్-విండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్‌కు రోహిత్, పంత్, పాండ్యా తిరిగి అందుబాటులోకి వస్తారు. కోహ్లీ, బుమ్రా, షమీలకు మాత్రం చోటు దక్కలేదు. 

భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.
Team India
Shikhar Dhawan
West Indies
Trinidad

More Telugu News