Sri Lanka: శ్రీలంక అధ్యక్షుడి ఎన్నికలు నేడే.. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ విక్రమసింఘేకే విజయావకాశాలు!

Sri Lanka Presidential election today
  • దేశం నుంచి పారిపోయి దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గొటబాయ
  • తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రణిల్ విక్రమసింఘే
  • ఎన్నికల నేపథ్యంలో శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు
ఆర్థిక, ఆహార, చమురు, ఔషధాల సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ దేశ ప్రజల ఆగ్రహానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహీంద రాజపక్సలు రాజీనామా చేయాల్సి వచ్చింది. గొటబాయ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం నుంచి పరారయ్యారు. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న ఆయన... అక్కడి నుంచే రాజీనామా లేఖను పంపించారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఈరోజు శ్రీలంకలో ఎన్నికలు జరుగుతున్నాయి. 

ప్రస్తుతం శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యవహరిస్తున్నారు. ఆరు సార్లు శ్రీలంక ప్రధానిగా పని చేసిన విక్రమసింఘే అధ్యక్షుడి ఎన్నికల్లో ఫ్రంట్ రన్నర్ గా ఉన్నారు. అయితే, శ్రీలంక ప్రజలు ఆయనను కూడా నమ్మడం లేదు. రాజపక్స కుటుంబంతో విక్రమసింఘేకు మంచి అనుబంధం ఉందని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విక్రమసింఘే ప్రధానిగా ఉన్న సమయంలో రాజపక్స సోదరుల అవినీతిపై కనీసం విచారణ కూడా జరిపించలేదనేది వారి ఆగ్రహానికి కారణం. అందుకే రణిల్ విక్రమసింఘేను వారు 'రణిల్ రాజపక్స' అంటూ విమర్శిస్తున్నారు. 

అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేత అయిన విక్రమసింఘేకు రాజపక్సల పార్టీ ఎస్ఎల్పీపీ పూర్తి మద్దతును ప్రకటించింది. 225 మంది సభ్యులున్న పార్లమెంటులో ఎస్ఎల్పీపీకి అత్యధిక సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో, విక్రమసింఘే విజయం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు, ఎన్నికల నేపథ్యంలో దేశంలో విక్రమసింఘే ఎమర్జెన్సీని విధించారు. సైన్యానికి విక్రమసింఘే పూర్తి అధికారాలను ఇచ్చారు. ఇంకోవైపు, విక్రమసింఘే అధ్యక్షుడిగా గెలుపొందితే... విపక్ష నేత సజిత్ ప్రేమదాస ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Sri Lanka
President
Elections
Ranil Wickremesinghe
Gotabaya Rajapaksa

More Telugu News