Daria Kasatkina: తాను స్వలింగ సంపర్కురాలినంటూ సంచలనం సృష్టించిన రష్యా టెన్నిస్ తార

Russia tennis star Daria Kasatkina sensational comments
  • వరల్డ్ నెం.12గా కొనసాగుతున్న దరియా కసాట్కినా
  • తాజాగా తన భాగస్వామితో ఫొటోను పంచుకున్న వైనం
  • స్వలింగ సంపర్కంపై ఆసక్తికర వ్యాఖ్యలు
రష్యా టెన్నిస్ భామ, వరల్డ్ నెంబర్ 12 క్రీడాకారిణి దరియా కసాట్కినా తాను లెస్బియన్ (స్వలింగ సంపర్కురాలు) అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తన భాగస్వామితో కలిసున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. హోమోసెక్సువల్స్ పట్ల రష్యాలో అనుసరిస్తున్న వైఖరిని ఆమె తప్పుబట్టింది. 

ఇటీవల రష్యా ప్రభుత్వం అన్ని రకాల సంప్రదాయ విరుద్ధ శృంగార సంబంధాలను బహిర్గతం చేయడాన్ని నిషేధించేలా కొత్త చట్టానికి ప్రతిపాదనలు చేసింది. రష్యాలో స్వలింగ సంపర్క సంబంధిత అంశాలను ప్రసారం చేయడంపై 2013 నుంచే నిషేధం ఉంది. అంతేకాదు, 1993 నుంచి రష్యాలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, టెన్నిస్ తార దరియా కసాట్కినా ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ, తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తాను లెస్బియన్ ను అంటూ ధైర్యంగా అంగీకరించింది. నిషేధించాల్సిన అంశాలు దీనికంటే ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయని, అయినా ప్రభుత్వ నిర్ణయంలో ఆశ్చర్యపడాల్సిందేమీలేదని పేర్కొంది. సహజీవనం చేస్తున్న ఇద్దరమ్మాయిలు తమ బంధాన్ని గోప్యంగా ఉంచాలని వారు పేర్కొనడం  అర్థరహితం అని కసాట్కినా అభిప్రాయపడింది. ప్రశాంతత దిశగా మనస్సాక్షి ప్రకారం నడుచుకోవడం ఒక్కటే ముఖ్యమని వెల్లడించింది. 

ఇటీవలే తన స్వలింగ సంపర్కం గురించి నిర్భయంగా వెల్లడించిన రష్యా ఫుట్ బాల్ క్రీడాకారిణి నదియా కార్పొవాను కసాట్కినా అభినందించింది. కార్పోవా తన సెక్సువాలిటీని చాటేందుకు ముందుకు రావడం హర్షణీయం అని పేర్కొంది.
Daria Kasatkina
Comments
Tennis
Russia

More Telugu News