వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రమాదం నుంచి తప్పించుకున్న నిర్మాత బన్నీ వాసు

17-07-2022 Sun 22:39 | Andhra
  • గోదావరి వరద బీభత్సం
  • పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వరద ముంపు
  • బాడవ గ్రామానికి వెళ్లిన బన్నీ వాసు
  • పడవలో తిరిగొస్తుండగా ఘటన
Tollywood producer Bunny Vasu escapes boat incident
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో వరద బాధితులకు సాయం చేసేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. యలమంచిలి మండలంలోని బాడవ గ్రామం గోదావరి ముంపులో చిక్కుకుంది. అక్కడి వారిని కాపాడేందుకు బన్నీ వాసు బాడవ గ్రామం వెళ్లారు. అక్కడ ఓ గర్భవతిని, మరికొందరిని పడవలోకి ఎక్కించి ఏనుగువారి లంక తీసుకురావాలని భావించారు. 

అయితే, ఓ ప్రదేశంలో వారు ఎక్కిన పడవ వరద ఉద్ధృతికి గురైంది. ఓ కొబ్బరిచెట్టుకు తగిలి ఆగిపోగా, పడవలోని వారు భయపడి అటూఇటూ కదలడంతో పడవ ఓ పక్కకి ఒరిగింది. పడవ నడిపే వ్యక్తులు వెంటనే అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. గర్భవతితో పాటు బన్నీ వాసు తదితరులు సురక్షితంగా బయటపడడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. 

ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ, అదృష్టం కొద్దీ ప్రమాదం నుంచి గట్టెక్కామని తెలిపారు. లంక గ్రామాల ప్రజల పరిస్థితి పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. కాగా, గోదావరి ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ పలు ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి.