Cooking oil: గుండె జబ్బులు ఉన్నవారు ఏ నూనెలు వాడితే మంచిది.. నిపుణుల సలహాలివిగో..

  • ప్రతిరోజు వంటలో తప్పనిసరిగా వినియోగించే నూనెలు
  • ప్రతి నూనెలో మంచి చేసే పలు రకాల విటమిన్లు, ఇతర పోషకాలు
  • పరిమిత స్థాయిలో తీసుకుంటే మేలు జరుగుతుందంటున్న పోషకాహార నిపుణులు
  • హృద్రోగులకు ఆలివ్‌, కుసుమ, ఆవ నూనెలతో ఎక్కువ ప్రయోజనం
Which oils should be used by people with heart disease Here is Expert advice

భారతీయుల వంటల్లో నూనెది ప్రత్యేక స్థానం. వంట ఏదైనా, ఎలాంటిదైనా నూనె వాడకుండా చేయడమనేది దాదాపు కనిపించదు. నిజానికి శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో నూనెల ద్వారా అందుతుంటాయి. అవి మన ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంటాయి. ఇప్పటికే గుండె జబ్బులుగానీ, ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన ఇతర గుండె సమస్యలతోగానీ బాధపడుతూ ఉంటే.. నూనెల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి నూనెలు ఏవైనా పరిమిత స్థాయిలో తీసుకుంటే మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఆలివ్‌, కుసుమ, ఆవ నూనెలతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు. వీటికి అదనంగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, రైస్‌ బ్రాన్‌, సోయా నూనెలు కూడా వాడవచ్చని సూచిస్తున్నారు. అయితే పామాయిల్‌, పత్తి నూనె, జంతువుల ఎముకలు, కొవ్వుల నుంచి తీసే నూనెలకు, కల్తీ నూనెలకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. గుండెకు ప్రయోజనం చేకూర్చే ఏడు రకాల నూనెల ప్రత్యేకతలను వివరిస్తున్నారు.

1) వేరుశనగ నూనె
గుండెకు మేలు చేసే వంట నూనెలలో ఇదీ ఒకటి. దీనిలో విటమిన్ ఈ, మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఈ గుండెకు మంచిది. ఈ నూనె చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒమేగా-6, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి సరిగా అందాలంటే ఆలివ్ నూనె, వేరుశనగ నూనె కలిపి వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

2) ఆలివ్ నూనె
ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే వంట నూనెలలో ఆలివ్ నూనె కీలకమైనది. ఇందులో పాలీఫెనాల్స్ అనే వృక్ష ఆధారిత రసాయనాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి నేరుగా సహాయపడతాయి. ఇక ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆలివ్‌ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో జీవక్రియలను సరిదిద్ది, బరువు తగ్గడంలో సహాయపడతాయి.

3) పొద్దుతిరుగుడు నూనె
సన్‌ ఫ్లవర్ ఆయిల్ లేదా పొద్దుతిరుగుడు నూనె గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇతర నూనెలతో పోలిస్తే.. సన్‌ ఫ్లవర్ ఆయిల్‌లో గుండెకు మేలు చేసే విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది.

4) ఆవ నూనె
ఈ నూనె కేవలం గుండెకు మాత్రమే కాకుండా చర్మం, కీళ్లు, శరీరంలోని ఇతర భాగాలు మెరుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనెలో మోనో అన్‌ శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె జబ్బుల నియంత్రణకు తోడ్పడతాయి. ఇక ఆవ నూనె జీర్ణ క్రియను, ఆకలిని మెరుగుపరుస్తుందని కూడా నిపుణులు చెప్తున్నారు.

5) రైస్ బ్రాన్ ఆయిల్
రైస్ బ్రాన్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఉత్తమ వంట నూనెల్లో ఒకటి. ఈ నూనెలో పాలీఅన్‌ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌ లు సమతుల్య స్థాయిలో ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

6) సోయా నూనె
సోయా నూనె మొత్తం శరీరానికి మేలు చేసే మంచి ఫ్యాటీ యాసిడ్లు, పోషకాలను కలిగి ఉంటుంది. సోయా ఆయిల్ శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. గుండెపోటు, ఇతర గుండె సమస్యలను నివారిస్తుంది.

7) కుసుమ నూనె
ఈ నూనె శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కుసుమ నూనెలోని రసాయన పదార్థాలు రక్త నాళాలు గట్టి పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. అందువల్ల గుండె జబ్బులు ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

More Telugu News