బీజేపీ, ఎన్సీపీ కలిసినప్పుడు అసహజం కాలేదా?.. రాజకీయాల్లో అసహజం అంటూ ఏమీ ఉండదు: సంజయ్ రౌత్

17-07-2022 Sun 14:41 | National
  • ఎన్సీపీ, కాంగ్రెస్ లతో శివసేన పొత్తును తప్పుపడుతూ షిండే శివసేన ఎమ్మెల్యేల వ్యాఖ్యలు
  • దానిపై పార్టీ పత్రిక ‘సామ్నా’లో స్పందించిన సంజయ్ రౌత్
  • ఎన్సీపీ–బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయజూసినప్పుడు అది సహజమైన పొత్తు అయి ఉండేదా అని నిలదీత
Nothing Unnatural in politics says sanjay raut
రాజకీయాల్లో అసహజమైనవంటూ ఏమీ ఉండబోవని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఎన్సీపీ, కాంగ్రెస్ లతో శివసేన అసహజమైన పొత్తు పెట్టుకోవడం వల్లే తాము తిరుగుబాటు చేశామంటూ షిండే శివసేన ఎమ్మెల్యేలు తరచూ చేస్తున్న ప్రకటనలను ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు శివసేన పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో పలు వ్యాఖ్యలు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిస్థితులను గుర్తు చేస్తూ.. అప్పుడు బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రం సహజమైన పొత్తు అంటారా? అని ప్రశ్నించారు.

ఆ ప్రభుత్వం కొనసాగి ఉంటే అనేవారా?
ఇప్పుడు శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే వెళ్లినట్టుగానే అప్పట్లో అజిత్ పవార్ వెళ్లి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని.. కానీ సరైన మద్దతు లేక కూలిపోయిందని గుర్తు చేశారు. ‘‘ఒకవేళ బీజేపీ–ఎన్సీపీ కూటమి ప్రభుత్వం గనుక కొనసాగి ఉంటే.. దానిని అసహజమైన కూటమి, అసహజ పొత్తు అని ఉండేవారా?. రాజకీయాల్లో అసహజం, సహజం అంటూ ఏమీ ఉండవు” అని పేర్కొన్నారు. 

2019లో ఏం జరిగింది?
మహారాష్ట్రలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సరైన మెజారిటీ రాలేదు. బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసినా.. సీఎం పదవి విషయంలో విభేదాలు వచ్చి దూరంగా ఉన్నాయి. దాంతో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన వర్గంతో వెళ్లి బీజేపీతో కలిశారు. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోలేకపోవడంతో ఆ ప్రభుత్వం కూలిపోయింది. దానితో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ‘మహా వికాస్ అగాధీ’ కూటమిగా ఏర్పడి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో రెబెల్ ఎమ్మెల్యేలు.. బీజేపీ వెంట నిలవడంతో ఏక్ నాథ్ షిండే సీఎంగా ప్రభుత్వం ఏర్పాటైంది.