Telangana: భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలు: సీఎం కేసీఆర్ హామీ

Colonies on permanent basis for Bhadrachalam flood victims says CM KCR
  • వరద చేరని ఎత్తైన ప్రాంతాలను గుర్తించి నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ కు ఆదేశం
  • గోదావరి వరద  ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి 
  • పునరావాస కేంద్రాల్లో ప్రజలను పరామర్శించిన కేసీఆర్ 

భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం కేసీఆర్ అన్నారు.   తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం వాసుల కన్నీళ్లను తుడిచేందుకు వారికి శాశ్వత ప్రాతిపదికన నివాసాల కోసం కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. వరద చేరని, అనువైన ఎత్తైన ప్రదేశాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, కాలనీల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించిన సీఎం, భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. 

అక్కడ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువులు, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు.  తమకు శాశ్వత ప్రాతిపదికన ఇళ్లు నిర్మిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News