KCR: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే రద్దు.. కారణమిదే!

CM KCRs aerial survey of flood affected areas has been cancelled
  • రోడ్డు మార్గాన ములుగు, ఏటూరు నాగారం మీదుగా సీఎం పర్యటన
  • భారీ వర్షంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్
  • పర్యటన తర్వాత ఏటూరు నాగారంలో అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

గోదావరి నది వరద ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం నిర్వహించాల్సిన  ఏరియల్ సర్వే రద్దయింది. వర్షాలు కురవడం, వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే రద్దయిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. వరద బాధిత ప్రజలను చేరుకోవడానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. ములుగు, ఏటూరునాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటూ భారీ వర్షంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగుతున్నది.

గోదావరి నదిలో ప్రతిఏటా ఉధృతంగా వస్తున్న వరదల నుంచి పరీవాహక ప్రాంత ప్రజలను రక్షించడానికి అవసరమైన శాశ్వత కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గోదావరి నది వరద ప్రభావిత ప్రాంతాల ఏరియల్ సర్వే నిర్వహించడానికి ముందుగా శనివారం రాత్రి మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తదితర ప్రజా ప్రతినిధులతో హనుమకొండలో సీఎం సమీక్ష నిర్వహించారు. గోదావరి నది, ఇతర ఉపనదుల కాంటూర్ లెవల్స్, నదులలో గతంలో ఎన్ని సార్లు ఎన్నిలక్షల క్యూసెక్కుల ప్రవాహం, ఎప్పడెప్పుడు వచ్చిందని ఇరిగేషన్ అధికారులను ఆరా తీశారు.  కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో వున్న కరకట్టలు, వాటి నాణ్యత, తదితర విషయాల గురించి అధికారులతో చర్చించారు.

 గోదావరి నదీ తీరంలో వరద వల్ల భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులు పడకుండా సమగ్రమైన సర్వే నిర్వహించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. ఈ విషయంలో అనుభజ్ఞులైన ఇరిగేషన్ శాఖ విశ్రాంత ఇంజనీర్ల సలహాలు, సూచనలు  కూడా తీసుకోవాలని సీఎం సూచించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు అన్నిరకాల సహాయ, సదుపాయాలు కల్పించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. 

అత్యవసర సహాయం కోసం కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లకు కోటి రూపాయల చొప్పున నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును ఆదేశించారు.ప్రజలకు అవసరమైన మందులు, ఆహారం అందిస్తూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంకా కొన్నిరోజుల పాటు గోదావరిలో వరద కొనసాగే అవకాశం వున్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా వుండాలని సీఎం పేర్కొన్నారు. వరద ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఏటూరు నాగారంలో అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News