YSRCP: ఆ కంపెనీ నిజంగా మాదే అయితే దాన్ని చంద్రబాబుకే ఫ్రీగా రాసిస్తాం: విజ‌య‌సాయిరెడ్డి

ysrcpp leader vijay sai reddy hits back tdp allegations on his family
  • కామ‌న్ డైరెక్ట‌ర్లుగా ఉంటే కంపెనీలు సొంతమవుతాయా అన్న సాయిరెడ్డి
  • చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌లేద‌ని వెల్ల‌డి
  • రాజ‌కీయంగా ఎదుర్కోలేక త‌ప్పుడు ప్ర‌చారాల‌న్న వైసీపీ ఎంపీ
క్రూయిజ్ కంపెనీ త‌న‌ కుమార్తెదంటూ టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఆ కంపెనీ నిజంగా మాదే అయితే దాన్ని చంద్రబాబుకే ఫ్రీగా రాసిస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. నేడు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆరోప‌ణ‌ల‌పై సాయిరెడ్డి విరుచుకుప‌డ్డారు. చంద్రబాబు ఎంత పచ్చి అబద్దాలకోరు అన్నది ఆయ‌న చేసే ఆరోప‌ణ‌ల‌ను బ‌ట్టి అర్థమవుతుందని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. 

అడాన్ కంపెనీ త‌మ‌ కుటుంబానికి చెందిందంటూ చంద్రబాబు, టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని సాయిరెడ్డి మండిప‌డ్డారు. ఇతర కంపెనీల్లో కామన్ డైరెక్టర్లుగా ఉన్నంత మాత్రాన ఆ కంపెనీలు త‌మ‌ కుటుంబానికి చెందినవిగా దుష్ప్రచారం చేయడం తగదని హిత‌వు ప‌లికారు. త‌న‌ను రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ నాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న సాయిరెడ్డి... ఇలాంటి దుష్ప్రచారాలు తామూ చేయగలమ‌ని చెప్పారు.

తాను ఈరోజు వరకూ చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఏనాడూ మాట్లాడలేదని సాయిరెడ్డి తెలిపారు. కానీ వారు పరిధి దాటి ప్రవర్తిస్తే తాము కూడా వారికి పదింతలు చేయాల్సి వస్తుందని ఆయ‌న హెచ్చ‌రించారు. చంద్రబాబు హయాంలో 20 మద్యం డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చార‌న్న సాయిరెడ్డి... 254 కొత్త బ్రాండులకు అనుమతులు కూడా చంద్ర‌బాబే ఇచ్చార‌న్నారు. మద్యంలో ఆరితేరింది చంద్రబాబా?.. తామా? అని సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.
YSRCP
Vijay Sai Reddy
TDP
Chandrababu
Nara Lokesh

More Telugu News