kanwar yatra: కన్వర్ యాత్రకు ఉగ్రముప్పు హెచ్చరిక.. భద్రత కట్టుదిట్టం చేసిన ఉత్తరాఖండ్ పోలీసులు

  • పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోం శాఖ
  • భద్రతను పెంచినట్టు తెలిపిన ఉత్తరాఖండ్ పోలీసులు
  • ఈ నెల 14న మొదలైన యాత్ర
Uttarakhand Police tightens security as terror threat looms over Kanwar Yatra

రెండు రోజుల కిందట మొదలైన కన్వర్ యాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలను కేంద్ర  హోం శాఖ అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో యాత్రకు భద్రతను కట్టుదిట్టం చేశారు. తమ రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, కన్వర్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. ఈసారి యాత్రపై నిఘా ఉంచేందుకు పోలీసులు డ్రోన్లను కూడా మోహరిస్తున్నారు.
 
  గంగానది పవిత్ర జలాన్ని సేకరించి, శివుడికి జలాభిషేకం చేసేందుకు నాలుగు కోట్ల మంది కన్వర్ యాత్రికులు ఈ ఏడాది ఉత్తరాఖండ్‌కు వస్తారని భావిస్తున్నారు. పక్షం రోజుల పాటు సాగే కన్వర్ యాత్రలో భాగంగా ‘కన్వరియా’లు వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్లి హరిద్వార్, రిషికేశ్ నుంచి గంగానది పవిత్ర జలాన్ని తీసుకొచ్చి తమ స్వగ్రామంలో శివునికి జలాభిషేకం చేస్తారు. అతి పెద్ద పవిత్ర యాత్ర దృష్ట్యా పరిపాలన పరంగా విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఉత్తరాఖండ్ అధికారులు చెబుతున్నారు. 

యాత్ర జరిగే ప్రాంతాన్ని 12 సూపర్ జోన్లు, 32 జోన్లు, 120 సెక్టార్లుగా విభజించించారు. మొత్తం పది వేల మంది పోలీసులు, ఐదు కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు, బాంబ్ స్క్వాడ్‌తో సహా యాంటీ టెర్రరిజం స్క్వాడ్, జల్ పోలీసులను మోహరిస్తున్నట్లు ఉత్తరాఖండ్ పోలీసులు పేర్కొన్నారు. దీనితో పాటు, ప్రతి కార్యకలాపంపై డేగ కన్ను ఉంచడానికి 400 సీసీటీవీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, ఢిల్లీ-రిషికేశ్ జాతీయ రహదారిని ఈ నెల 20 నుంచి 26 వరకు మూసివేస్తున్నారు. యాత్ర జరిగే సమీప ప్రాంతాల్లో మాంసం దుకాణాలను మూసివేశారు.

More Telugu News