Boris Johnson: రిషి నాకు ద్రోహం చేశాడు.. ఆయనను మాత్రం ఎన్నుకోవద్దు: మద్దతుదారులతో బోరిస్ జాన్సన్

  • బ్రిటన్ ప్రధాని రేసులో ముందువరుసలో రిషి సునక్
  • రిషి ద్రోహం చేశాడన్న భావనలో బోరిస్ ఉన్నారంటూ ‘ద టైమ్స్’ కథనం
  • మరెవరినైనా ఎన్నుకోవాలంటూ మద్దతుదారులకు బోరిస్ సూచన
  • ఆ ప్రచారంలో వాస్తవం లేదన్న బోరిస్ సన్నిహితుడు
Boris Johnson tells allies to Back anyone  but Rishi Sunak for Britain PM

బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్న భారత సంతతికి చెందిన రిషి సునక్‌ ఓటమే లక్ష్యంగా తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. రిషి ప్రధాని పీఠం ఎక్కకుండా ఎలాగైనా సరే నిలువరించాలని ఆయన తన మద్దతుదారులకు బోధిస్తున్నట్టు సమాచారం. రిషి తప్ప మరెవరైనా పర్వాలేదని, ఆయనకు మాత్రం మద్దతు పలకొద్దని బోరిస్ తన మద్దతుదారులకు చెబుతున్నారట. రిషి తనకు ద్రోహం చేశాడని, ఆయన వల్లే సొంత పార్టీ నేతలు కూడా తనకు దూరమయ్యారని బోరిస్ ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. 

తదుపరి ప్రధానిగా ఎవరు ఉండాలన్న విషయంలో తాను తలదూర్చబోనని జాన్సన్ చెప్పినప్పటికీ, రిషి మాత్రం ప్రధాని కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారని ‘ద టైమ్స్’ ఓ కథనంలో పేర్కొంది. సునక్‌ను కాకుండా విదేశాంగమంత్రి లిజ్ ట్రస్ కానీ, లేదంటే జాకబ్ రీస్, డోరిస్, పెన్నీ మోర్డాంట్‌లలో ఎవరో ఒకరికి మద్దతునివ్వాలని అంతర్గతంగా ప్రచారం చేస్తున్నట్టు ఆ కథనం పేర్కొంది. 

10 డౌనింగ్ స్ట్రీట్ రిషిని వ్యక్తిగతంగా ద్వేషిస్తోందని, బోరిస్‌ను పదవి నుంచి తప్పించేందుకు కొన్ని నెలలుగా రిషి ప్రయత్నిస్తున్నట్టు డౌనింగ్ స్ట్రీట్ భావిస్తోందని ఆ కథనం వివరించింది. అయితే, ఇది తప్పుడు కథనమని, ఈ ప్రచారంలో వాస్తవం లేదని బోరిస్ సన్నిహితుడొకరు తెలిపారు. రిషిని ఓడించేందుకు జాన్సన్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న ఆయన.. రిషి తనకు ద్రోహం చేశాడని మాత్రం బోరిస్ భావిస్తున్నారని పేర్కొన్నారు.

More Telugu News