ఎమ్మెల్సీ అనంత‌బాబుకు ఈ నెల 29 వ‌ర‌కు రిమాండ్ పొడిగింపు

  • సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో నిందితుడు అనంత‌బాబు
  • అధికార వైసీపీ నుంచి స‌స్పెండ్ అయిన వైనం
  • రిమాండ్‌ను పొడిగిస్తూ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టు ఆదేశాలు
mlc anantha babu judicial remand extended up to july 29

ఏపీలో రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించిన డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంత‌బాబు రిమాండ్‌ను పొడిగిస్తూ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టు శుక్ర‌వారం నిర్ణ‌యం తీసుకుంది. త‌న వ‌ద్ద కొంత కాలం పాటు డ్రైవ‌ర్‌గా ప‌ని చేసి మానుకున్న‌సుబ్ర‌హ్మ‌ణ్యంను స్వ‌యంగా పిలుచుకుని వెళ్లిన అనంత‌బాబు... అత‌డిపై దాడి చేసి హ‌త్య చేసిన సంగతి తెలిసిందే. అర్థ‌రాత్రి స‌మ‌యంలో సుబ్ర‌హ్మ‌ణ్యం మృత‌దేహాన్ని త‌న కారులోనే స్వయంగా బాధితుడి ఇంటి వ‌ద్ద‌కు తీసుకొచ్చిన అనంత‌బాబు దుస్సాహ‌సం రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది.

ఈ ఘ‌ట‌న‌పై ద‌ళిత సంఘాల‌తో పాటు విప‌క్ష టీడీపీ పెద్ద ఎత్తున ఉద్య‌మం చేప‌ట్ట‌డంతో అనంత‌బాబును అధికార వైసీపీ అప్ప‌టిక‌ప్పుడు సస్పెండ్ చేసింది. ఆపై ఆయ‌న‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌గా.... ప్ర‌స్తుతం అనంత‌బాబు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కేంద్ర కారాగారంలో విచార‌ణ ఖైదీగా ఉంటున్నారు. గ‌తంలో విధించిన జ్యూడిషియ‌ల్ రిమాండ్ గ‌డువు ముగిసిన నేపథ్యంలో శుక్ర‌వారం ఆయ‌న‌ను రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టులో పోలీసులు హాజ‌రుప‌రిచారు. ఈ సంద‌ర్భంగా అనంతబాబు రిమాండ్‌ను ఈ నెల 29 వ‌ర‌కు పొడిగిస్తున్నట్టు న్యాయ‌మూర్తి ప్ర‌క‌టించారు. దీంతో తిరిగి అనంత‌బాబును పోలీసులు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైల్‌కు త‌ర‌లించారు.

More Telugu News