ఢిల్లీ-వడోదర ఇండిగో విమానం ఇంజిన్‌లో ప్రకంపనలు.. జైపూర్‌కు మళ్లింపు

15-07-2022 Fri 11:56 | National
  • విమానం ఇంజిన్‌లో క్షణకాలంపాటు కంపనాలు
  • అత్యవసరంగా జైపూర్‌లో ల్యాండ్ చేసిన పైలట్
  • ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు
  • దర్యాప్తునకు ఆదేశించిన డీజీసీఏ
IndiGo Delhi Vadodara Flight Diverted To Jaipur
ఢిల్లీ నుంచి వడోదర వెళ్తున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో క్షణకాలంపాటు ప్రకంపనలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా జైపూర్‌కు మళ్లించారు. గత రాత్రి జరిగిందీ ఘటన. అనంతరం అందులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రత్యామ్నాయ విమనాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఇండిగో అధికార ప్రతినిధి నిర్ధారించారు. విమానం ఇంజిన్‌లో ప్రకంపనలు రేగడంతో అత్యవసరంగా ఇండిగో విమానం 6E-859ను జైపూర్ మళ్లించినట్టు తెలిపారు. 

మార్గమధ్యంలోనే పైలట్‌కు హెచ్చరిక సందేశం అందిందని, దీంతో ముందుజాగ్రత్త చర్యగా తదుపరి తనిఖీల కోసం విమానాన్ని పైలట్ జైపూర్‌కు మళ్లించాడని ఆయన పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ విమానం ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది.