Madras High Court: మంగళసూత్రం తీసేయడమంటే భర్తపై క్రూరత్వం ప్రదర్శించడమే: మద్రాస్ హైకోర్టు

Removal of Mangalsutra by wife is mental cruelty on husband says Madras High Court
  • భర్త నుంచి విడిపోయిన భార్య 
  • తాళి లేకున్నా వైవాహిక బంధంపై ప్రభావం చూపదన్న మహిళ తరపు న్యాయవాది
  • వివాహిత తన భర్త బతికి ఉన్నంత వరకు తాళిని తీసే సాహసం చేయదన్న కోర్టు
  • అది భర్తను మానసికంగా హింసించడమేనన్న న్యాయస్థానం
  • వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ డిక్రీ జారీ చేసిన హైకోర్టు
భర్త నుంచి విడిపోయిన భార్య తన మెడలోని తాళి(మంగళసూత్రం)ని తీసివేయడమంటే భర్తను ఆమె మానసిక క్రూరత్వానికి గురిచేయడమే అవుతుందని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ బాధిత భర్తకు విడాకులు మంజూరు చేసింది. ఈరోడ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సి. శివకుమార్ అప్పీల్‌ను అనుమతిస్తూ జస్టిస్ వీఎం వేలుమణి, ఎస్.సౌంథర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల ఈరోడ్‌లోని ఓ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సి శివకుమార్‌‌కు విడాకులు ఇచ్చేందుకు కుటుంబ న్యాయస్థానం నిరాకరిస్తూ తీర్పు చెప్పడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని ఆయన కోరారు.

విడిపోయిన సమయంలో తన తాళిని తొలగించినట్టు శివకుమార్ భార్య అంగీకరించింది. అయితే, తాను గొలుసును మాత్రమే తొలగించానని, మంగళసూత్రాన్ని మాత్రం ధరించానని ఆమె తెలిపింది. అందుకు కారణం కూడా ఉందని పేర్కొంది. ఆమె తరపు న్యాయవాది మాట్లాడుతూ.. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7ను ప్రస్తావిస్తూ.. తాళి కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఆమె దానిని తొలగించినా వైవాహిక బంధంపై అది ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు.

అయితే, ఆ వాదనను జస్టిస్ వీఎం వేలుమణి, ఎస్‌ సౌంథర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. వివాహ వేడుకల్లో తాళి కట్టడం అనేది ఒక ముఖ్యమైన ఆచారమని, అది అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొంది. హిందూ వివాహిత తన భర్త జీవితకాలంలో ఏ సమయంలోనూ తాళిని తీసేందుకు సాహసించదని, కానీ ఆమె తన తాళిని తీసినట్టు స్వయంగా అంగీకరించిందని, దానిని బ్యాంక్ లాకర్‌లో పెట్టినట్టు పేర్కొందని ధర్మాసనం తెలిపింది.

మహిళ మెడలో తాళి పవిత్రమైన విషయమని, ఇది వైవాహిక జీవితం కొనసాగింపును సూచిస్తుందని కోర్టు పేర్కొంది. భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగిస్తారని, కాబట్టి ఆమె చర్యను భర్తను మానసికంగా హింసించే చర్యగా చెప్పొచ్చని, ఇది అత్యున్నత స్థాయి మానసిక క్రూరత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్న కోర్టు విడాకులు మంజూరు చేసింది. 

 2011 నుంచి పిటిషనర్, ఆయన భార్య వేర్వేరుగా నివసిస్తున్నారని, ఈ కాలంలో మళ్లీ తిరిగి ఒక్కటి కావాలనే ప్రయత్నం జరిగినట్టు ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. భార్య తన చర్య ద్వారా భర్తకు మానసిక క్రూరత్వం కలిగించిన దృష్ట్యా పిటిషనర్, ప్రతివాది(భార్య) మధ్య వివాహాన్ని రద్దు చేసి విడాకులు మంజూరు చేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.
Madras High Court
Mangasutra
Wife
Husband
Divorce

More Telugu News