Daler Mehndi: దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు శిక్ష.. కస్టడీలోకి తీసుకున్న పోలీసులు!

  • మానవ అక్రమ రవాణా కేసులో దలేర్ కు జైలు శిక్ష
  • తమ ట్రూప్ సభ్యులుగా జనాలను విదేశాలకు తీసుకెళ్లి వదిలేసిన దలేర్ సోదరులు
  • తనను మోసం చేశారంటూ 2003లో కేసు వేసిన బక్షీష్ సింగ్
  • 2017లో మృతి చెందిన శంషేర్ మెహందీ
Daler Mehndi gets 2 years jail term in human trafficking case

ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి పటియాలాలోని జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 2003లో నమోదైన కేసుకు సంబంధించి కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. 

కేసు వివరాల్లోకి వెళ్తే... విదేశాలకు వెళ్లినప్పుడు కొందరిని తన ట్రూప్ సభ్యులుగా తీసుకెళ్లి, వారిని అక్కడే వదిలేసేవారు. ఇలా జనాలను విదేశాలకు తీసుకెళ్లినందుకు వారి వద్ద నుంచి లక్షల రూపాయలను వసూలు చేసేవారు. ముఖ్యంగా అమెరికా, కెనడాలకు వీరు జనాలను తీసుకెళ్లేవారు. తన సోదరుడు శంషేర్ సింగ్ మెహందీతో కలిసి దలేర్ మెహందీ ఈ పని చేసినట్టు పోలీసులు అభియోగాలు మోపారు. 

అయితే తమ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని, ఆ తర్వాత తమను విదేశాలకు తీసుకెళ్లలేదని చాలా మంది దలేర్ సోదరులపై ఆరోపణలు చేశారు. ఇలాంటి వారిలో ఒకరైన బక్షీష్ సింగ్ 2003లో పటియాలాలో దలేర్ పై కేసు పెట్టారు. 1998, 1999లో దలేర్, ఆయన సోదరుడు 10 మందిని అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లారని... తన వద్ద నుంచి కూడా రూ. 13 లక్షలు తీసుకున్నారని... కానీ, తనను విదేశాలకు తీసుకెళ్లలేదని, తన డబ్బును కూడా వెనక్కి తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైన నెల రోజుల్లో దలేర్ బ్రదర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, రోజుల వ్యవధిలోనే వారికి బెయిల్ మంజూరయింది. 

మానవ అక్రమ రవాణా, మోసం సెక్షన్లతో పాటు ఇండియన్ పాస్ పోర్ట్ యాక్ట్ కింద వీరిపై అభియోగాలు నమోదయ్యాయి. వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మరో 35 ఫిర్యాదులు కూడా వచ్చినట్టు సమాచారం. 2018లో ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు 2 సంవత్సరాల శిక్షను విధించింది. ఆ తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. 

ఆ తర్వాత తనకు విధించిన శిక్షను దలేర్ మెహందీ జిల్లా కోర్టులో సవాల్ చేశారు. ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు... రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ ఈరోజు శిక్షను ఖరారు చేసింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. మరోవైపు దలేర్ సోదరుడు శంషేర్ మెహందీ 2017లో మృతి చెందారు.

More Telugu News