Vijayashanti: తొందర్లోనే వారే కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెడతారు: విజయశాంతి

Vijayashanti fires on KCR
  • రైతులపై కేసీఆర్ ప్రభుత్వం కపట ప్రేమను చూపిస్తోందన్న విజయశాంతి 
  • రైతులకు ఎకరాకు రూ. 20 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ 
  • రైతులను ఆదుకునే ఒక్క పథకాన్ని కూడా కేసీఆర్ అమలు చేయడం లేదని విమర్శ 
రైతన్నలపై కేసీఆర్ ప్రభుత్వం కపట ప్రేమను చూపిస్తోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయని... ఎంతో ఆశతో తొలకరికి పంటలు వేసుకున్న రైతులకు ఈ వర్షం తీవ్ర నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి, ఎకరాకు రూ. 20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని అన్నారు. 

రైతులు కొత్త పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్ పుట్ సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకం అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ త‌రపున‌ డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కేసీఆర్ స‌ర్కార్ నిర్లక్ష్యం కారణంగా... అకాల వర్షాలు, వరదలకు పంట నష్టపోవడం, పరిహారం అందకపోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు. 

రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు పంటలు దెబ్బతిని రైతులు కుదేలవుతున్నా వారిని ఆదుకునే పథకమేదీ ప్రభుత్వం అమలు చేయకపోవడం అన్నదాతల పట్ల కేసీఆర్‌కు ఉన్న కపట ప్రేమకు నిదర్శనమని అన్నారు. కేంద్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమ‌లు చేయ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌కరమని మండిపడ్డారు. అది అమలు చేయ‌క‌పోయినా, దానికి ప్రత్యామ్నాయ పథకాల ద్వారా అయినా వారిని ఆదుకోకపోవడం... కేసీఆర్‌కు రైత‌న్న‌ల ప‌ట్ల ఉన్న ప్రేమ‌కు నిద‌ర్శ‌నమని వ్యంగ్యంగా అన్నారు. కేసీఆర్ చేస్తున్న అరాచక పాల‌న‌ను ప్ర‌జలు చూస్తునే ఉన్నారని... తొంద‌ర్లోనే వారే కేసీఆర్‌కు క‌ర్రు కాల్చి వాత పెట్ట‌డం ఖాయమని విజయశాంతి పేర్కొన్నారు. 
Vijayashanti
BJP
KCR
TRS

More Telugu News