మహారాష్ట్రలో పెట్రోలుపై రూ. 5, డీజిల్​ పై రూ. 3 తగ్గింపు

14-07-2022 Thu 14:22 | National
  • మహారాష్ట్రలో ఇంధన ధరలు తగ్గించిన కొత్త సీఎం షిండే
  • ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటిదాకా మహారాష్ట్రలోనే ఎక్కువ రేట్లు
  • తగ్గించడంతో వాహనదారులకు కాస్త ఊరట
Petrol price slashed by Rs 5 in Maharashtra  diesel becomes cheaper by Rs 3
మహారాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తీపి కబురు చెప్పారు. భారీగా పెరిగిన ఇంధన ధరల విషయంలో కొంత ఊరట కల్పించారు. మహారాష్ట్రలో లీటరు పెట్రోలుపై రూ. 5, డీజిల్ పై రూ. 3 తగ్గిస్తూ షిండే సర్కారు నిర్ణయం తీసుకుంది. ముంబైలో గత పదకొండు రోజులుగా రూ. 111.35 గా ఉన్న లీటరు పెట్రోలు తాజా తగ్గింపుతో రూ. 106.35కు తగ్గనుంది. ఇప్పటిదాకా రూ. 97.28గా ఉన్న లీటరు డీజిల్ ఇకపై 94.28 కే లభించనుంది.  

ఇతర నగరాలతో పోలిస్తే  పెట్రోల్, డీజిల్ రేట్లు ముంబైలోనే ఎక్కువగా ఉండటంతో షిండే సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది. బుధవారం నాటికి లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.96.72, కోల్ కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63, గువాహటిలో రూ. 96.48గా ఉన్నాయి. లీటరు డీజిల్ రేట్లు ఢిల్లీలో రూ.89.62, కోల్ కతాలో రూ.92.76, చెన్నైలో రూ.94.24, గువాహటిలో రూ. 84.37గా ఉన్నాయి. ఇక, హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 109.66 కాగా, డీజిల్ రేటు రూ. 97.82గా ఉంది.