Parliament: వద్దన్న పదాలనే వాడుతా.. కావాలంటే నన్ను సస్పెండ్​ చేయండి: లోక్​ సభ స్పీకర్​కు టీఎంసీ ఎంపీ సవాల్​

  • ఉభయ సభల్లో కొన్ని పదాలు వాడొద్దని  జాబితా విడుదల 
  • ఖండించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ 
  • సాధారణ పదాలను నిషేధించడం సరికాదని వ్యాఖ్య
Suspend me TMC MP Derek challenges Parliaments censor order ahead of Monsoon session

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొన్ని పదాలను ఉభయ సభల్లో ఉపయోగించకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఖండించారు. సాధారణ పదాలను కూడా అన్ పార్లమెంటరీ పదాలుగా పేర్కొనడం సరికాదన్నాడు. తాను ‘సాధారణ’ పదాలను సభలో ఉపయోగిస్తానన్నారు. కావాలంటే లోక్ సభ స్పీకర్ తనను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. 

ఈ నెల 18 నుంచి జరిగే లోక్ సభ, రాజ్య సభ వర్షాకాల సమావేశాల్లో సభ్యులు కొన్ని పదాలు వాడకూడదంటూ లోక్ సభ సెక్రటేరియట్ బుధవారం ఓ బుక్ లెట్ ను విడుదల చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డెరెక్ ఆ ఆదేశాలను ధిక్కరిస్తానంటూ ట్వీట్ చేశారు.

'‘కొన్ని రోజుల్లో సెషన్ ప్రారంభమవుతుంది. ఎంపీలపై ఆంక్షలు మొదలు పెట్టారు. పార్లమెంటులో ప్రసంగం చేస్తున్నప్పుడు 'సిగ్గుపడుతున్నాను.. దుర్వినియోగం చేశారు.. ద్రోహం చేశారు.. అవినీతిపరుడు.. వంచన.. అసమర్థుడు' వంటి ప్రాథమిక పదాలను ఉపయోగించడానికి మాకు అనుమతి లేదట. నేనైతే ఈ పదాలన్నింటినీ ఉపయోగిస్తాను. నన్ను సస్పెండ్ చేయండి. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటా’' అని డెరెక్ స్పష్టం చేశారు.

More Telugu News