Daggubati Purandeswari: జగన్ కక్షపూరితంగా పాలిస్తున్నారు.. శ్రీలంక బాటలోనే ఏపీ: పురందేశ్వరి

AP Will become like Sri Lanka Says Purandeswari
  • రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్న పురందేశ్వరి
  • మద్య నిషేధం తీసుకొస్తానన్న జగన్, మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శ 
  • కేసుల విషయంలో జగన్‌కు బీజేపీ అండగా నిలుస్తోందన్న వాదనను కొట్టిపడేసిన వైనం
  • జనసేనతో పొత్తు కొనసాగుతుందని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి శ్రీలంకను తలపిస్తోందని, రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఢిల్లీలో ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని జగన్ కక్షతో పాలిస్తున్నారని ఆరోపించారు. 

ఏపీ అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించలేదన్నది అబద్ధమని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చాలా సహకరించిందని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు కరవయ్యాయన్న పురందేశ్వరి.. ప్రజలు తమ కష్టాలను సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై బీజేపీ ఎప్పటికప్పుడు ఆందోళనలు చేస్తూనే ఉందని పేర్కొన్నారు.

మద్య నిషేధం తీసుకొస్తామన్న జగన్ లిక్కర్ రేట్లు పెంచేసి మద్యాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్నారని ఆరోపించారు. అప్పులు, ఉచిత పథకాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే అవకాశం ఉందన్నారు. రాష్ట్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. కేసుల విషయంలో జగన్‌కు బీజేపీ పూర్తిగా సహకరిస్తోందన్న ఆరోపణలపై పురందేశ్వరి స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. 

ఇక రాష్ట్రంలో పొత్తుల గురించి అధినాయకత్వం ఆలోచిస్తుందని, అది తమ పని కాదన్నారు. జనసేనతో పొత్తు మాత్రం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని పురందేశ్వరి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయం జాతీయ విధానంలో భాగమని ఆమె వివరించారు.
Daggubati Purandeswari
BJP
Andhra Pradesh
YSRCP
YS Jagan

More Telugu News