Pistols: ఒకటీ రెండు కాదు... ఆ భారతీయ దంపతుల వద్ద ఏకంగా 45 పిస్టళ్లు లభ్యం

  • వియత్నాం నుంచి ఢిల్లీ వచ్చిన దంపతులు
  • రెండు బ్యాగుల నిండా తుపాకులు
  • స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
  • కేసు విచారణ చేపట్టిన ఎన్ఎస్ జీ
Custom officials found 45 pistols from Vietnam returned Indian couple in Delhi airport

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయ దంపతులను సోదా చేసిన కస్టమ్స్ అధికారులు నివ్వెరపోయారు. వారి వద్ద ఏకంగా 45 పిస్టళ్లు లభ్యమయ్యాయి. ఆ దంపతులిద్దరినీ అరెస్ట్ చేశారు. వారిని జగ్జీత్ సింగ్, జస్వీందర్ కౌర్ లుగా గుర్తించారు. 

అయితే, వారి నుంచి స్వాధీనం చేసుకున్నవి అవి నిజం తుపాకులా? కాదా? అనే అంశం కూడా పరిశీలించారు. ఈ కేసును విచారిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జీ) మాత్రం ఇవి నిజం తుపాకులేనని అభిప్రాయపడింది. ఈ తుపాకులు పూర్తిగా పనిచేసే స్థితిలో ఉన్నాయని ఎన్ఎస్ జీ గుర్తించిందని ఓ కస్టమ్స్ అధికారి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న తుపాకుల విలువ రూ.22.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. 

కాగా, జగ్జీత్ సింగ్, జస్వీందర్ కౌర్ దంపతులు వియత్నాంలోని హోచిమిన్ సిటీ నుంచి ఢిల్లీకి వచ్చారు. జగ్జీత్ సింగ్ వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో ఈ తుపాకులను గుర్తించారు. వాటిని తన సోదరుడు మంజీత్ సింగ్ ఇచ్చినట్టు జగ్జీత్ విచారణలో తెలిపాడు. ఆ పిస్టళ్లను మంజీత్ సింగ్ ఫ్రాన్స్ లోని పారిస్ నుంచి వియత్నాం తెచ్చాడని, అక్కడ తన సోదరుడు జగ్జీత్ కు అప్పగించాడని వెల్లడైంది. అనంతరం హోచిమిన్ సిటీ ఎయిర్ పోర్టు నుంచి మాయం అయ్యాడని కస్టమ్ అధికారి వివరించారు. 

కాగా, ఆ రెండు బ్యాగులకు ఉన్న సెక్యూరిటీ ట్యాగ్ లను తొలగించి, వాటిని రూపుమాపడం ద్వారా జస్వీందర్ కౌర్ భర్తకు సాయపడిందని తెలిపారు. అంతేకాదు, తామిద్దరం గతంలో టర్కీ నుంచి భారత్ కు 25 పిస్టళ్లు తెచ్చినట్టు ఆ దంపతులు ఒప్పుకున్నారని వెల్లడించారు.
.

More Telugu News