Google: సాధారణ నియామకాలకు గూగుల్ బ్రేక్..!

  • నిపుణులైన మానవ వనరులకే ప్రాధాన్యం ఇవ్వనున్న గూగుల్
  • సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టీకరణ
  • ఉద్యోగుల స్థానాల్లోనూ మార్పులు ఉంటాయని ప్రకటన
Google to slow down hiring for the rest of 2022 CEO Sundar Pichai

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం, ప్రతి పౌరుడికి పరిచయమైన గూగుల్ (ఆల్భాబెట్) 2022లో మిగిలిన ఆరు నెలల కాలంలో ఉద్యోగ నియామకాలను తగ్గించుకోనుంది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు తెలియజేశారు. ఇంజనీర్లు, టెక్నికల్, ఇతర కీలక పోస్టులకు నియామకాలనే గూగుల్ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక మెమో పంపించారు. 

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. కానీ, గూగుల్ ఆర్థిక అనిశ్చితుల ప్రభావానికి పెద్దగా లోను కాలేదని చరిత్ర స్పష్టం చేస్తోంది. ఎందుకంటే గూగుల్ సేవలు, ఉత్పత్తులు నిజజీవితంలో భాగమైనవి. పైగా సంస్థకు చెందిన యూట్యూబ్ అన్నిటికంటే ఎక్కువ వృద్ధితో దూసుకుపోతోంది. 

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) గూగుల్ 10,000 మందిని నియమించుకున్నట్టు పిచాయ్ చెప్పారు. ఈ ఏడాదిలో ఇక సాధారణ నియామకాలు ఉండవని స్పష్టం చేశారు. ‘‘కానీ, 2022 మిగిలిన భాగం, 2023లో మేము ఇంజనీరింగ్, టెక్నికల్, ఇతర కీలక పోస్టులకు నియామకాలు చేపడతాం. కంపెనీ వృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా నైపుణ్య మానవ వనరులను తీసుకుంటాం’’ అని పిచాయ్ వివరించారు. 

అలాగే ఉన్న ఉద్యోగులను సైతం అధిక ప్రాధాన్య విభాగాల్లో నియమిస్తామని, ఆ సమయంలో ఇతర ప్రాజెక్టులను నిలిపివేస్తామని సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇప్పటికే మెటా (ఫేస్ బుక్), స్నాప్ చాట్ కూడా నియామకాలకు సంబంధించి ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నాయి.

More Telugu News