Elon Musk: ట్రంప్.. ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం

  • సబ్సిడీల కోసం మస్క్ అభ్యర్థించాడన్న డొనాల్డ్ ట్రంప్
  • నేను కోరితే మోకాళ్లపై నించుని అడుక్కునేవాడంటూ కామెంట్
  • ట్రంప్ రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమైనందన్న మస్క్
Donald Trump says Elon Musk almost begged for subsidies Musk says Trump needs to retire

అమెరికా మాజీ అధ్యక్షుడు, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధ్యక్ష బరిలోకి దూకాలనే ఉత్సాహంతో ఉన్న డొనాల్డ్ ట్రంప్, ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. వీరి మధ్య స్నేహభావం కాస్తా శత్రుత్వంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ తనకే ఓటు వేసినట్టు అబద్ధమాడాడని ట్రంప్ వ్యాఖ్యానించడం తెలిసిందే. రిపబ్లిక్ పార్టీ అనుకూలవాదిగా మస్క్ కు పేరుంది. 

మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయనున్నట్టు డీల్ ప్రకటన వెలువడిన తర్వాత.. మస్క్ మంచోడంటూ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ను ట్విట్టర్ నిషేధించడాన్ని మస్క్ లోగడ తప్పుబట్టారు. ఇవన్నీ వీరి సాన్నిహిత్యాన్ని తెలియజేస్తాయి. అలాంటిది వీరి మధ్య ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ట్రంప్ ఓ విషయాన్ని బయటపెట్టారు. 

‘‘నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మస్క్ వైట్ హౌస్ కు వచ్చారు. సబ్సిడీలతో నడుస్తున్న తన చాలా ప్రాజెక్టులకు సాయం చేయాలని కోరారు. దూర ప్రాంతాలకు వెళ్లలేని ఎలక్ట్రిక్ కార్లు, క్రాష్ అయ్యే డ్రైవర్ లేని కార్లు, ఎక్కడికీ వెళ్లాయో తెలియని రాకెట్ షిప్ లు.. సబ్సిడీలు లేకపోతే ఇవన్నీ విలువ లేనివే. అతడు నాకు, రిపబ్లికన్ పార్టీకి ఎంత అభిమానో చెప్పాడు. నేను కోరితే మోకాళ్లపై నించుని మరీ సబ్సిడీలను అడుక్కునేవాడు’’ అంటూ మస్క్ ను ట్రంప్ ఏకిపారేశారు. 

ట్రంప్ పోస్ట్ ను ఓ యూజర్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. హాస్యాస్పదంగా దీన్ని మస్క్ అభివర్ణించారు. 'నేను ట్రంప్ ను అసహ్యించుకోవడం లేదు. కానీ, మాజీ అధ్యక్షుడు సూర్యాస్తమయంలోకి ప్రయాణించే సమయం (రిటైర్మెంట్) ఆసన్నమైంది. ట్రంప్ మనుగడకు ఉన్న ఏకైక మార్గం తిరిగి అధ్యక్ష పదవిని సాధించడమే’’ అని మస్క్ స్పందించాడు.  

More Telugu News