సెల్ఫీ​ తీసుకుందామని వెళ్లి అగ్నిపర్వతంలో పడిపోయాడు.. హెలికాప్టర్ తో రక్షించిన సైన్యం

  • అగ్ని పర్వత బిలం వద్దకు ఎవరికీ లేని అనుమతి
  • ఎవరి కంటా పడకుండా నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించిన యువకుడు
  • బిలం మూలంపైకి వెళ్లి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో పడిపోయిన ఫోన్
  • దాని కోసం వంగి బిలంలోకి జారిపోయి.. మధ్యలో చిక్కుకున్న వైనం
us tourist injured falling mount vesuvius crater

అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అగ్ని పర్వతాల్లో ఒకటైన మౌంట్ వెసువియస్. ఇటలీలోని నేపుల్స్ నగరానికి దగ్గరగా ఉంటుంది. తరచూ యాక్టివ్ గా మారే ఈ అగ్ని పర్వతంపై ప్రధాన బిలం వద్దకు పర్యాటకులకు అనుమతి లేదు. కేవలం కొన్ని ఏరియాలకు మాత్రమే వెళ్లనిస్తారు. అలాంటిది ఓ అమెరికన్ పర్యాటకుల కుటుంబం మెల్లగా అందరి కళ్లుగప్పి నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించింది. అడ్డదారుల్లో నడుస్తూ మెల్లగా అగ్ని పర్వతం పేలినప్పుడు లావాను వెళ్లగక్కే ప్రధాన బిలం వద్దకు చేరుకుంది.

ఫోన్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ..
ఆ కుటుంబంలోని ఓ యువకుడు ఆ బిలం అంచున నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన ఫోన్ జారిపోయి బిలంలో పడింది. ఫోన్ పడిపోతున్న క్రమంలో దాన్ని అందుకోవడానికి ప్రయత్నించిన యువకుడు కూడా బిలంలోకి జారిపోయాడు. కొంత దూరం దిగువ వరకు వెళ్లిపోయి అక్కడ రాళ్లను పట్టుకుని ఆగిపోయాడు. అది చూసిన కొందరు పర్యాటక గైడ్ లు.. వెంటనే మౌంటేన్ పోలీసులకు సమాచారమిచ్చారు. బిలంలోకి దిగి ఆ యువకుడిని రక్షించే పరిస్థితి లేకపోవడంతో.. రెస్క్యూ హెలికాప్టర్ ను రప్పించి.. యువకుడిని కాపాడారు.

ఆ చుట్టూ 40 అగ్ని పర్వతాలు
బిలంలోకి జారి పడిపోయినప్పుడు యువకుడి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నిషేధిత ప్రమాదకర ప్రాంతంలోకి ప్రవేశించినందుకు యువకుడితోపాటు అతడి కుటుంబంపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. పలు భద్రతా కారణాల రీత్యా ఆ అమెరికన్ యువకుడు, అతడి కుటుంబం వివరాలను వెల్లడించలేమని వెసువియస్ మౌంటేన్ పోలీసులు ప్రకటించారు.

  • ఇటలీలోని నేపుల్స్ చుట్టూ అత్యంత ప్రధానమైన వెసువియస్ తోపాటు మరో 40 చిన్న అగ్ని పర్వతాలు కూడా ఉన్నాయి.
  • 2017 నేపుల్స్ కు సమీపంలోని ‘సోల్ఫతరా డి పొజౌలి’ అగ్నిపర్వత బిలంలో పడి 11 ఏళ్ల బాలుడు, అతడి తల్లిదండ్రులు చనిపోయారు. 
  • అంతకుముందు, తర్వాత కూడా అగ్ని పర్వతంపై అక్కడక్కడా ఉన్న చిన్న బిలాలు (వెంట్స్) నుంచి వెలువడే విష వాయువులతో చాలా మంది స్పృహ తప్పి పడిపోవడం వంటివి జరిగాయి.

అత్యంత ప్రమాదకరం..
  ప్రపంచంలోని యాక్టివ్ అగ్ని పర్వతాల్లో వెసువియస్ ఒకటి. 1,281 మీటర్లు (4,202 అడుగుల) ఎత్తుతో ఉండే ఈ అగ్ని పర్వతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతుంటారు. అగ్ని పర్వతంపై ప్రధాన బిలంతోపాటు అక్కడక్కడా చిన్న బిలాలు కూడా ఉంటాయి. వాటి నుంచి తరచూ అతి తీవ్రమైన వేడి వాయువులు, విష వాయువులు వెలువడుతుంటాయి. వాటి దగ్గరికి వెళ్తే.. చనిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఒకనాటి చారిత్రక రోమన్ నగరమైన పోంపే సర్వనాశనం కావడానికి వెసువియస్ అగ్నిపర్వతం పేలడమే కారణం.

More Telugu News