Mo Farah: నేను మీరు అనుకుంటున్న 'మో ఫరా'ను కాదు... సంచలన వాస్తవాలు వెల్లడించిన ఒలింపిక్ పతక విజేత

  • బ్రిటన్ క్రీడారంగంలో దిగ్గజ అథ్లెట్ గా గుర్తింపు
  • వరుసగా రెండు ఒలింపిక్స్ లో గోల్డెన్ డబుల్
  • తాను చిన్నప్పుడే బ్రిటన్ వచ్చానని మో ఫరా వెల్లడి
  • తన అసలు పేరు హుస్సేన్ అబ్దీ కాహిన్ అని స్పష్టీకరణ
  • అక్రమరవాణా ద్వారా తీసుకువచ్చారని వివరణ
Mo Farah sensational revelations about his past

మో ఫరా... అథ్లెటిక్స్ రంగం గురించి తెలిసిన వారికి ఈ పేరును పరిచయం చేయనక్కర్లేదు. లాంగ్ డిస్టెన్స్ పరుగు పందాల్లో 39 ఏళ్ల మో ఫరా ఓ దిగ్గజం. 5 కిలోమీర్లు, 10 కిలోమీటర్ల పరుగులో లండన్ ఒలింపిక్స్ (2012), రియో ఒలింపిక్స్ (2016)లో ఫరా గోల్డెన్ డబుల్ సాధించాడు. అనేక వరల్డ్ చాంపియన్ షిప్ లలోనూ పసిడి పతకాలు కైవసం చేసుకున్నాడు. బక్కపలుచగా ఉండే మో ఫరా అథ్లెటిక్స్ లో బ్రిటన్ కు ప్రాతినిధ్యం వహిస్తుంటాడు. ఇవి ఇప్పటివరకు అందరికీ తెలిసిన విషయాలు. 

కానీ మో ఫరా తన నేపథ్యం గురించి తొలిసారి సంచలన వాస్తవాలు వెల్లడించాడు. తన అసలు పేరు మో ఫరా కాదని తెలిపాడు. తన పేరు హుస్సేన్ అబ్దీ కాహిన్ అని వెల్లడించాడు. 9 ఏళ్ల వయసులో సోమాలియా నుంచి బ్రిటన్ కు అక్రమ రవాణా ద్వారా వచ్చానని తెలిపాడు. ఓ మహిళ తనను జిబూటీ నగరం నుంచి బ్రిటన్ తీసుకువచ్చిందని, తాను ఇప్పటివరకు ఆమెను మళ్లీ చూడలేదని మో ఫరా చెప్పాడు. ఆమే తనకు మహ్మద్ ఫరా (మో ఫరా) అనే పేరు పెట్టిందని వివరించాడు.

బ్రిటన్ వచ్చిన తర్వాత తాను ఓ ఇంటివారి పిల్లలను చూసుకోవడానికి 9 ఏళ్ల వయసులో పనివాడిగా కుదిరానని తెలిపాడు. ఈ మేరకు బీబీసీ టీవీ కోసం రూపొందించిన 'ద రియల్ మో ఫరా' అనే కార్యక్రమంలో ఈ వివరాలను అందరితో పంచుకున్నాడు. 

కాగా, తాను సోమాలియా నుంచి తల్లిదండ్రులతో బ్రిటన్ కు శరణార్థిగా వచ్చానని మో ఫరా గతంలో తెలిపాడు. కానీ తాజాగా బీబీసీ డాక్యుమెంటరీలో అసలు విషయం చెప్పాడు. తన తల్లిదండ్రులు అసలు బ్రిటన్ ముఖమే చూడలేదని వెల్లడించాడు. తనకు నాలుగేళ్ల వయసున్నప్పుడే తండ్రి సోమాలియాలో జరిగిన అల్లర్లలో మరణించాడని వివరించాడు. సోమాలియా భూభాగం నుంచి విడవడిన ఓ ప్రాంతంలో తన తల్లి, ఇద్దరు సోదరులు నివసిస్తున్నారని మో ఫరా తెలిపాడు. 

"నేను చెప్పినవన్నీ నిజాలు... నేను మీరనుకుంటున్నట్టు మో ఫరాను కాను. చాలామందికి నేను మో ఫరాగానే తెలుసు. వాస్తవానికి నా పేరు అది కాదు. నా నేపథ్యం వేరే" అని పేర్కొన్నాడు. 

మో ఫరా ఒలింపిక్ చరిత్రలో నాలుగు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి బ్రిటీష్ అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు. కాగా, తన గతం గురించి అందరికీ చెప్పాలని తన పిల్లలు ప్రేరేపించారని మో ఫరా వెల్లడించాడు. ఫరా చెప్పిన విషయాలతో బ్రిటన్ క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, అతడి నేపథ్యం గురించి అతడి మాటల్లోనే విన్న వారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.

More Telugu News