Beer: ‘బీరు’తో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్న తాజా అధ్యయనం

  • పేగుల్లో బ్యాక్టీరియా వైవిధ్యం పెరుగుతుంది
  • దీర్ఘకాలిక వ్యాధులపై మంచి ప్రభావం చూపిస్తుంది
  • శరీర బరువు అదుపులో ఉంటుంది
  • పోర్చుగల్ కు చెందిన సంస్థ పరిశోధన వెల్లడి
Beer can make your gut healthier prevent diabetes obesity Study

ఆల్కహాల్ (మద్యపానం) సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదన్న హెచ్చరికలు, సూచనలు ఎన్నో సార్లు వింటూనే ఉంటాం. కానీ, దీనికి విరుద్ధమైన ఫలితాలను ఓ అధ్యయనం గుర్తించింది. బీరు పేగులకు మంచిదని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని పోర్చుగల్ కు చెందిన ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ హెల్త్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్’ పరిశోధనలో తేలింది. బీరులో ఉండే పాలీ ఫెనాల్స్ పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావం చూపిస్తున్నట్టు తెలుసుకున్నారు. రెడ్ వైన్ లో పాలీఫెనాల్స్ వల్ల కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా పరిశోధకులు ప్రస్తావించారు. 

బీరుతో పేగుల్లోని బ్యాక్టీరియా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులను నివారించడంలో ఈ బ్యాక్టీరియా పాత్రను ప్రస్తావిస్తున్నారు. 23 నుంచి 58 ఏళ్ల వయసులోని ఆరోగ్యవంతులైన అభ్యర్ధులపై ఈ పరిశోధన నిర్వహించారు. ఒక్కొక్కరిని రోజూ 330 మిల్లీ లీటర్ల బీరు తాగాలని సూచించారు.

‘‘బీరు తీసుకోవడం వల్ల పేగుల్లో బ్యాక్టీరియా వైవిధ్యం పెరుగుతోంది. అది కూడా బరువు, కొవ్వులు పెరగకుండానే’’ అని పరిశోధకులు చెప్పారు. అలాగే బీరు తాగడం వల్ల గుండె జబ్బుల మార్కర్లు అయిన గ్లూకోజు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను ప్రభావితం చేయడం లేదని కూడా ఈ పరిశోధన తెలుసుకుంది. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించారు.

More Telugu News