Prime Minister: ప్ర‌ధాని మోదీ రాజ్యాంగాన్ని ధిక్క‌రించారంటూ అస‌దుద్దీన్ ఆరోప‌ణ‌

  • నూత‌న పార్ల‌మెంట్‌పై జాతీయ చిహ్నాన్ని ఆవిష్క‌రించిన మోదీ
  • ప్ర‌ధానిగా మోదీకి ఆ అర్హ‌త లేదంటూ అస‌ద్ ట్వీట్‌
  • ప్ర‌ధానికి లోక్‌ స‌భ స్పీక‌ర్ స‌బార్డినేట్ కాదని ఆగ్ర‌హం
majlis chief asaduddin owaisi fires on pm modi over unveiled the national emblem atop new parliament building

భార‌త ప్ర‌ధాన మంత్రి హోదాలో న‌రేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ధిక్క‌రించారంటూ మ‌జ్లిస్ అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ మేర‌కు సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌నంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని మోదీ సోమ‌వారం ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇలా పార్ల‌మెంటు భ‌వ‌నంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్క‌రించే అర్హ‌త ప్ర‌ధానికి లేద‌ని అస‌దుద్దీన్ ఆరోపించారు. 

భారత‌ రాజ్యాంగం పార్ల‌మెంటు, ప్రభుత్వం, న్యాయ వ్య‌వ‌స్థల పేరిట ఆయా శాఖ‌ల అధికారాల‌ను విభ‌జించింద‌ని స‌ద‌రు ట్వీట్‌లో అస‌దుద్దీన్ పేర్కొన్నారు. దీని ప్ర‌కారం ప్ర‌భుత్వాధినేత‌గా ఉన్న మోదీ పార్ల‌మెంటు భ‌వ‌నంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్క‌రించ‌రాద‌ని ఆయ‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మోదీ వెన‌కాల లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కూర్చుని ఉన్న ఫొటోను కూడా ప్ర‌స్తావించిన ఓవైసీ... లోక్ స‌భ స్పీక‌ర్ ప్ర‌ధాని కింద స‌బార్డినేట్ కాద‌ని కూడా తెలిపారు. వెర‌సి ఈ కార్య‌క్ర‌మంలో మోదీ రాజ్యాంగాన్ని ధిక్క‌రించార‌ని ఆయ‌న ఆరోపించారు.

More Telugu News