థాకరేకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. శివసేన రెబెల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సుప్రీం నిరాకరణ

11-07-2022 Mon 13:53
  • ఏక్ నాథ్ షిండేతో కలిసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని కోరిన థాకరే వర్గం
  • వారిపై ఇప్పుడే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్ ను ఆదేశించిన సుప్రీం కోర్టు
  • కొత్త ముఖ్యమంత్రి షిండేకు ఊరట
SC asks Maharashtra Speaker not to proceed with disqualification pleas of Sena MLAs
మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు మరో షాక్. సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, కొత్త ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. 

ఆ ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత ఫిర్యాదులపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ రాహుల్ నార్వేకర్ ను చీఫ్ జస్టిన్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుంప్రీకోర్టు బెంచ్ ఆదేశించింది. ఇదే విషయాన్ని స్పీకర్ కు తెలియజేయాలని మహారాష్ట్ర గవర్నర్ తరఫున విచారణకు హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీం బెంచ్  సూచించింది. 

ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో థాకరే, షిండే వర్గాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అయితే, అత్యవసర విచారణ చేపట్టలేమన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ పిటిషన్లపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. దాంతో, కొత్తగా అధికారంలోకి వచ్చిన షిండే వర్గానికి ఊరట కలగ్గా.. థాకరే వర్గానికి ఎదురు దెబ్బ తగిలినట్టయింది.