రూ.119 కోట్లతో ఫ్లాట్ కొనుగోలు చేసిన దీపిక, రణవీర్ జంట

11-07-2022 Mon 13:30
  • ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కొనుగోలు
  • సాగర్ రేషమ్ రెసిడెన్షియల్ టవర్లో నాలుగు అంతస్తుల్లో ఫ్లాట్
  • సీ వ్యూ ఫ్లాట్ కు ప్రత్యేక ఆకర్షణ
  • పొరుగునే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ ఫ్లాట్లు  
Ranveer Singh Deepika Padukone buy Rs 119 crore flat in Bandra next to SRK Salman Khan
బాలీవుడ్ యువ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో ఇల్లు సమకూర్చుకున్నారు. సాగర్ రేషమ్ రెసిడెన్షియల్ టవర్లో ఫ్లాట్ ను రూ.119 కోట్లతో కొనుగోలు చేశారు. ఫ్లాట్ నుంచి చూస్తే ఒకవైపు సముద్రం కనిపిస్తుంటుంది. సీ వ్యూ అపార్ట్ మెంట్ కావడంతో భారీగా వెచ్చించారు. దేశం మొత్తం మీద ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ఇంత భారీ ధర పలకడం ఇదేనని తెలుస్తోంది. 

ఆశ్చర్యకరంగా రణవీర్, దీపిక అపార్ట్ మెంట్ కు సమీపంలోనే షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఫ్లాట్లు కూడా ఉన్నాయి. సల్మాన్ కు చెందిన గెలాక్సీ అపార్ట్ మెంట్స్, షారూక్ ఖాన్ కు చెందిన మనత్ బంగ్లా మధ్య సాగర్ రేషమ్ రెసిడెన్షియల్ టవర్ ఉంది. రణవీర్ జంట కొనుగోలు చేసిన ఫ్లాట్ క్వాడ్రప్లెక్స్. అంటే ఒకే ఫ్లాట్ నాలుగు అంతస్తులుగా ఉంటుంది. 16, 17, 18, 19 అంతస్తుల్లో వీరి ఫ్లాట్ ఉంది. మొత్తం విస్తీర్ణం 11,266 చదరపు అడుగులు.