UN Report: వచ్చే ఏడాదికి.. జనాభాలో నంబర్ 1 స్థానానికి భారత్!

  • 2023లో చేరుకుంటుందన్న ఐక్యరాజ్యసమితి నివేదిక
  • ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు
  • భారత్ లో జనాభా 141.2 కోట్లు
  • 2050 నాటికి భారత్ జనాభా 166.8 కోట్లకు పెరుగుతుందన్న అంచనాలు
India Likely To Surpass China As Most Populous Country In 2023 UN Report

జనాభా పరంగా భారత్ 2023లో చైనాను అధిగమించి, అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఐక్యరాజ్యసమితి సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులోని అంశాలను పరిశీలించినట్టయితే.. 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా సంఖ్య 800 కోట్ల మార్క్ ను చేరుకుంటుంది.

1950 తర్వాత ప్రపంచ జనాభా అత్యంత తక్కువ వృద్ధి రేటును చూస్తోంది. 2020లో జనాభా వృద్ధి రేటు ఒక శాతం లోపునకు పడిపోయింది. 2030 నాటికి 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లకు ప్రపంచ జనాభా విస్తరించనుంది. 2080 నాటికి 1040 కోట్లకు చేరి, 2100 నాటికి అదే స్థాయిలో జనాభా ఉంటుంది.

ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు కాగా, భారత్ జనాభా 141.2 కోట్ల స్థాయిలో ఉంది. 2050 నాటికి పెరిగే జనాభాలో అధిక శాతం భారత్, కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా నుంచే ఉండనుంది. ప్రపంచంలో అతిపెద్ద దేశాల మధ్య జనాభా వృద్ధి రేట్లలో ఉన్న అసమానతలే వాటి స్థానాలు మారేందుకు దారితీస్తున్నాయి. భారత్ జనాభా 2050నాటికి 166.8 కోట్లకు పెరగనుంది. అప్పుడు చైనా జనాభా 131.7 కోట్ల వద్దే ఆగిపోనుంది.

More Telugu News