Hyderabad: హైదరాబాద్​ లో సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. కరెంటు బిల్లులు కట్టాలంటూ మోసం

Fraudsters now turn to pending power bills in Hyderabad
  • విద్యుత్ బోర్డు ఉద్యోగుల పేరుతో వినియోగదారులకు సందేశాలు
  • పెండింగ్ బిల్లు కట్టకుంటే కరెంట్ కట్ చేస్తామని బెదిరిస్తున్న మోసగాళ్లు
  • యాప్ ద్వారా బిల్లు కట్టాలంటూ బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి నగదు విత్ డ్రా చేస్తున్న దొంగలు
  • అప్రమత్తంగా ఉండాలంటున్న హైదరాబాద్ పోలీసులు
టెక్నాలజీని వాడుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో కొత్త తరహా ఆన్ లైన్ మోసం బయటపడింది. విద్యుత్ బోర్డు ఉద్యోగుల పేరుతో ప్రజలకు ఫోన్ చేస్తూ  కరెంటు బిల్లులు కట్టాలంటూ అందిన కాడికి దోచుకుకుంటున్నారు. 

పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేస్తామనే సాకుతో మోసగాళ్లు విద్యుత్‌ బోర్డ్‌ ఉద్యోగులుగా నటిస్తూ వినియోగదారులను సంప్రదించిన ఘటనలు ఇటీవల నగరంలో వెలుగు చూశాయి. వాళ్ల మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దాంతో, సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
 
పోలీసు అధికారుల వివరాల ప్రకారం.. మొదట మోసగాడు తాను లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి మొబైల్ ఫోన్‌కు మీ కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉందని ఎస్ఎం ఎస్ లేదా వాట్సాప్ ద్వారా సందేశం పంపుతాడు. బాధితుడు స్పందించిన  వెంటనే తమను తాము ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులుగా పరిచయం చేసుకుని తక్షణమే కరెంటు బిల్లు చెల్లించాలని, లేదంటే పవర్ కట్ చేస్తామని హెచ్చరిస్తారు. వాళ్ల మాటలు నిజమని నమ్మిన బాధితులు భయపడితే సైబర్ నేరగాళ్లు తదుపరి ముందుకెళ్తారు.  

బాధితుడికి లింక్‌ను పంపి, ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని దాని ద్వారా ముందుగా రూ. 30 లేదా 50 చెల్లించమని అడుగుతాడు. చెల్లించిన తర్వాత తిరిగి కాల్ చేస్తామని బాధితుడికి చెబుతారు. బాధితుడికి అనుమానం వచ్చే లోపే బ్యాంక్ ఖాతా లాగిన్ ఆధారాలను సేకరించి ఖాతాలో డబ్బు మొత్తాన్ని విత్ డ్రా చేస్తున్నారు. 

ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఈ తరహాలో మోసగాళ్ల చేతిలో రూ.8.5 లక్షలు పోగొట్టుకున్నాడు. మరో బాధితుడు రూ.1.5 లక్షలు పోగొట్టుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి మోసగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కరెంట్ బిల్లులు కట్టమని విద్యుత్ బోర్డు నుంచి ఎవ్వరూ ఫోన్లు చేయరని ప్రజలకు సూచిస్తున్నారు.
Hyderabad
cybercrime
power bills
electricity board
employees
aps

More Telugu News