Mecca Masjid: యూకే నుంచి 6,500 కిలోమీటర్లు నడిచి మక్కా చేరుకున్న వ్యక్తి

  • గతేడాది ఆగస్టు 1న యూకేలో ప్రారంభమైన నడక
  • పలు దేశాల మీదుగా గతనెలలో సౌదీ అరేబియా చేరుకున్న ఆడం మొహమ్మద్
  • 10 నెలల 25 రోజులపాటు ఏకధాటిగా నడక
  • మానవులందరూ సమానమేనని చాటడమే తన లక్ష్యమన్న ఆడం
Iraqi man walks 6500 km from the UK to reach Mecca for Hajj

సాధించాలన్న తపన ఉంటే లక్ష్యాన్ని చేరుకోకుండా ఆపడం ఎవరి తరమూ కాదని నిరూపించాడు ఇరాక్-కుర్దిష్ మూలాలున్న బ్రిటన్ వ్యక్తి. హజ్ యాత్రలో భాగంగా మక్కా చేరుకునేందుకు ఇంగ్లండ్‌లోని వాల్వర్‌హాంప్టన్‌లో అడుగు మొదలుపెట్టి 6,500 కిలోమీటర్లు నడిచి మక్కాను చేరుకున్నాడు. ఆయన పేరు ఆడం మొహమ్మద్. వయసు 52 సంవత్సరాలు. నెదర్లాండ్స్,  జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనాన్, జోర్డాన్‌ల మీదుగా నడుస్తూ 6,500 కిలోమీటర్ల దూరాన్ని చేరుకున్నాడు. 

గతేడాది ఆగస్టు 1న యూకేలో ప్రారంభమైన అతడి నడక గతనెలలో సౌదీ అరేబియాలో ఆగింది. మక్కా చేరుకునేందుకు అతడికి మొత్తంగా 10 నెలల 25 రోజులు పట్టింది. ప్రతి రోజూ సగటున 17.8 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ సందర్భంగా అతడు ఇస్లామిక్ పారాయణాలు పఠించాడు. ప్రయాణంలో అవసరమయ్యే వస్తువులను మోసుకెళ్లేందుకు ఇంట్లో సొంతంగా ఓ బండిని తయారుచేసుకున్నాడు. దాని బరువు 300 కేజీలు. దానికి స్పీకర్లు కూడా అమర్చుకున్నాడు. 

శాంతి, సమానత్వ సందేశాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా తాను ఈ పాదయాత్ర చేపట్టినట్టు ఆడం మొహమ్మద్ తెలిపాడు. ఇందుకోసం అతడు ‘గో ఫండ్‌మి’లో ఓ పేజీని కూడా క్రియేట్ చేశాడు. ‘‘నేను దీనిని కీర్తి కోసమో, డబ్బు కోసమే చేయడం లేదు. మన జాతి, మతం, రంగుతో సంబంధం లేకుండా మానవులందరూ సమానమేనని ప్రపంచానికి చాటడమే నా లక్ష్యం. ఇస్లాం బోధించే శాంతి, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయడానికే నా పర్యటన’’ అని పేర్కొన్నాడు. 

ఆయన తన ప్రయాణాన్ని టిక్‌టాక్‌లో ఎప్పటికప్పుడు పోస్టు చేశాడు. దీంతో అతడికి మిలియన్ ఫాలోవర్లు వచ్చి చేశారు. మినా చేరుకున్న తర్వాత ఆడంకు  తాత్కాలిక మంత్రి మాజిద్ బిన్ అబ్దుల్లా అల్-కసాబి ఆతిథ్యం ఇచ్చారు. హజ్ పర్మిట్‌ను ఇప్పించడంలో సాయం చేశారు. కాగా, కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత సౌదీ అరేబియా ఈ ఏడాది హజ్ యాత్రకు అనుమతించింది. 2020, 2021 సంవత్సరాల్లో హజ్ యాత్రను అరేబియా వాసులకు మాత్రమే పరిమితం చేసింది. కాగా, హజ్ యాత్ర ఈ నెల 7న ప్రారంభమైంది.

More Telugu News