Kcr: గణేశ్​ విగ్రహాలు, జాతీయ జెండాలు చైనా నుంచే.. ఇదా మేకిన్​ ఇండియా?: బీజేపీది మత పిచ్చి రాజకీయం: సీఎం కేసీఆర్​

  • బీజేపీ మత పిచ్చి రాజకీయాలతో దేశం నాశనమవుతోంది
  • చిల్లర రాజకీయం కోసం ప్రజల నోట్లో మట్టి కొడతారా?
  • ప్రభుత్వాలను కూలగొట్టడమే మీ రాజకీయమా? 
  • తెలంగాణలో ఏక్‌ నాథ్‌ షిండేను తీసుకురండి చూద్దామని కేసీఆర్‌ సవాల్‌
Ganesha idols national flags from China Is this Makein India Asks CM KCR

దేశంలో బీజేపీ మత పిచ్చి రాజకీయాలతో పెట్టుబడులు తరలిపోతున్నాయని.. మేకిన్‌ ఇండియా ఉత్త మాటలకే పరిమితమైందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా అదో పెద్ద డైలాగ్ లా చెబుతారని విమర్శించారు. “పతంగులు, దీపావళి టపాసులు, జాతీయ జెండాలు, గణపతి విగ్రహాలు కూడా చైనా నుంచి వస్తున్నాయి. మరోవైపు మన దేశంలో 38శాతం పరిశ్రమలు మూతపడ్డాయి. ఇది వాస్తవం కాదా? ఇదేనా మేకిన్‌ ఇండియా అంటే? దేశాన్ని ప్రధాని మోదీ సర్వనాశనం చేస్తున్నారు. దేశ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు.” అని కేసీఆర్ మండిపడ్డారు.

‘‘దేశ జీడీపీ అత్యంత పతనమైన మాట వాస్తవం కాదా? ద్రవ్యోల్బణం పెరిగినది వాస్తవం కాదా? రూపాయి విలువ పతనం, పెట్రోల్‌, వంట గ్యాస్ ధరల పెంపు, కోట్లాది ఉద్యోగాలు కోల్పోతున్న మాట వాస్తవం కాదా? దేశం నుంచి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నది వాస్తవం కాదా?ఇవన్నీ పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం, ప్రజలకు వివరిస్తాం. తప్పకుండా దోషులుగా నిలబెడతాం.” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రైతు బంధు నిలిపివేయడానికే బీజేపీ ఉందా అని.. కేంద్రం చిల్లర రాజకీయం కోసం ప్రజల నోట్లో మట్టికొడతారా అని నిలదీశారు.

దమ్ముంటే తెలంగాణ, తమిళనాడులో ఏక్‌ నాథ్‌ షిండేలను తీసుకురండి
బీజేపీ, ప్రధాని మోదీ కేంద్రంలో వికృత రాజకీయ క్రీడ కొనసాగిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వాలను కూలగొట్టడమే మీ రాజకీయమా? అని నిలదీశారు. దమ్ముంటే తెలంగాణ, తమిళనాడులో ఏక్‌ నాథ్‌ షిండేలను తీసుకురావాలని సవాల్‌ చేశారు. వర్షాలకు కాశీ ఘాట్‌ లో ప్రధాన గోపురం కూలిపోయిందని.. అది దేశానికి అరిష్టమని ప్రజలు బాధపడుతుంటే.. బీజేపీ వాళ్లు మాత్రం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించారు. తప్పకుండా మోదీ ప్రభుత్వాన్ని మారుస్తామని.. తమ ఎజెండా ఏమిటో త్వరలో చెబుతామని పేర్కొన్నారు.

More Telugu News