India: ఆయుధాల ఎగుమతుల్లో రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న భారత్

India races in arms and defense exports
  • 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.13 వేల కోట్ల ఎగుమతులు
  • ప్రైవేటు భాగస్వామ్యంతో ఆయుధ వ్యవస్థల అభివృద్ధి
  • పలు ఆసియా, ఆఫ్రికా దేశాలకు విక్రయం
  • కాసుల వర్షం కురిపిస్తున్న బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్
గతంలో విదేశాల నుంచి ఆయుధాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్, ఇప్పుడు తానే విదేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో రూ.13 వేల కోట్ల విలువైన ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలు, రక్షణ రంగ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. కొంతకాలంగా దేశీయ ఆయుధ తయారీ రంగం ఊపందుకుంది. ప్రైవేటు భాగస్వామ్యం కూడా పెరగడంతో సరికొత్త సాంకేతికతలతో కూడిన ఆయుధ వ్యవస్థలను భారత్ అభివృద్ధి చేస్తోంది. 

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతి చేసిన రక్షణ రంగ ఉత్పాదనల్లో ప్రైవేటు రంగ వాటా 70 శాతం కాగా, ప్రభుత్వ రంగ సంస్థల వాటా 30 శాతం. భారత్... చిన్న దేశాలైన ఫిలిప్పీన్స్, ఇతర ఆగ్నేయాసియా దేశాలకు, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు ఆయుధ వ్యవస్థలను సరఫరా చేస్తోంది. 

భారత్ అమ్ములపొదిలోని బ్రహ్మాస్త్రం అనదగ్గ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లను వాణిజ్య ప్రాతిపదికన విక్రయిస్తోంది. ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణులను అందించేందుకు రూ.2,770 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం దరిమిలా భారత ఆయుధ వ్యవస్థలపై ఇండోనేషియా, వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాలు కూడా ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. 

అంతేకాదు, బ్రహ్మోస్ క్షిపణులు, ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థల కోసం సౌదీ అరేబియా, యూఏఈ కూడా భారత్ తో చర్చలు జరుపుతున్నాయి. తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ కూడా విదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.
India
Arms
Defense
Exports

More Telugu News