CYBER ATTACK: దేశంలో రెండు వేల వెబ్ సైట్లు హ్యాక్... జాబితాలో ఏపీ పోలీసుల వెబ్ సైట్​.. కారణం ఇదే..!

Over two thousand websites have been hacked into including that of the Andhra Pradesh police
  • నుపుర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారత్ పై సైబర్ దాడి చేస్తున్న మలేషియా, ఇండోనేషియా హ్యాకర్లు
  • అసోం టీవీ చానెల్ తెరపై పాకిస్తాన్ జెండాను చొప్పించిన హ్యాకర్లు 
  • భారత్ పై సైబర్ దాడులు చేయాలని ముస్లిం హ్యాకర్లకు పిలుపు
  • గుర్తించిన అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
బీజేపీ బహిష్కృత నేత, ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ.. ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మలేషియా, ఇండోనేషియాకు చెందిన హ్యాకర్లు భారత్‌పై సైబర్ దాడులు చేస్తున్నారు. డ్రాగన్ ఫోర్స్ మలేషియా, హ్యాక్టివిస్ట్ ఇండోనేషియా అనే గ్రూపులు ఈ దాడులు చేస్తున్నాయి. భారత్ పై సైబర్ దాడులు చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం హ్యాకర్లకు ఇవి పిలుపునిచ్చాయి.

ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ గుర్తించారు. ఈ గ్రూపులపై చర్యలు తీసుకోవాలని మలేషియా, ఇండోనేషియా ప్రభుత్వాలకు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు లేఖ రాశారు. అలాగే వీటిపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌ పోల్‌కు కూడా లేఖ రాశారు.

ఈ రెండు గ్రూపులు ఇప్పటికే థానే పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, అసోంలోని ఒక న్యూస్ ఛానెల్‌ సహా రెండు వేలకు పైగా వెబ్‌సైట్‌లు హ్యాక్‌ చేశాయని తెలిపారు. అసోంకు చెందిన ఒక న్యూస్ చానెల్ ను ప్రత్యక్ష ప్రసార సమయంలో హ్యాక్ చేసి, కాసేపు చీకటిగా మార్చిన హ్యాకర్లు తెరపైకి పాకిస్థాన్ జెండా కనిపించేలా చేశారు.

ఆ సమయంలో తెరపై ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ను గౌరవించండి అని కనిపించింది. కింది భాగంలో 'పీకే రివల్యూషన్ టీమ్ దీన్ని హ్యాక్ చేసింది' అని వచ్చింది. సైబర్ నేరగాళ్లు నుపుర్ శర్మ వ్యక్తిగత వివరాలను, ఆమె చిరునామా సహా ఆన్‌లైన్‌లో పెట్టారు. అలాగే, పలువురి ఆధార్ కార్డు, పాన్ కార్డ్ వివరాలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ చేశారు.
CYBER ATTACK
HACKING
Andhra Pradesh police
websites
hacked
nupur sharma

More Telugu News