వైఎస్సార్‌తో కలిసి వున్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. నివాళి అర్పించిన పీవీపీ

  • ఫొటోలో పీవీపీ చేతిని ప‌ట్టుకుని నిల‌బ‌డిన వైఎస్సార్‌
  •  'విలువలు, విశ్వసనీయతకు మారుపేరు మీరు..' అంటూ నివాళి 
  • గత ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన పీవీపీ
pvp tributes to ysr with a rare photo

మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం ఆయ‌న‌కు నివాళులు హోరెత్తుతున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ నేత‌గా కొన‌సాగుతున్న ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త పొట్లూరి వ‌ర ప్ర‌సాద్ (పీవీపీ) వైఎస్సార్‌కు ఓ అరుదైన ఫొటోతో నివాళి అర్పించారు. వైఎస్ బ‌తికుండ‌గా... ఆయ‌న‌తో తాను క‌లిసి దిగిన ఫొటోను పీవీపీ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పీవీపీ చేతిని వైఎస్సార్ ప‌ట్టుకుని వేరే వ్య‌క్తితో మాట్లాడుతున్నారు. వైఎస్సార్ వెనుకాల ఆయ‌న మిత్రుడు, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత కేవీపీ రామ‌చంద్రరావు కూడా ఉన్నారు. 'విలువలు, విశ్వసనీయతకు మారుపేరు మీరు..' అంటూ వైఎస్సార్ కు పీవీపీ నివాళి అర్పించారు.

వ్యాపార రంగంలో నిత్యం బిజీగా క‌నిపించే పీవీపీ 2019 ఎన్నికల‌కు కాస్తంత ముందుగా వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఎలాగైనా విజ‌య‌వాడ‌కు ఒక్క‌సారి అయినా ఎంపీగా ప‌నిచేయాల‌న్న ల‌క్ష్యంతో సాగుతున్న ఆయ‌న అంతకుముందు జ‌న‌సేనలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీకి జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పీవీపీ క‌ల నెర‌వేర‌లేదు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరి విజ‌య‌వాడ లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్య‌ర్థి కేశినేని నాని చేతిలో ఓట‌మిపాల‌య్యారు. ఎన్నిక‌ల త‌ర్వాత పెద్ద‌గా రాజ‌కీయాల్లో క‌నిపించ‌ని పీవీపీ అప్పుడ‌ప్పుడు ఇలా సోష‌ల్ మీడియా వేదికగా పొలిటిక‌ల్ పోస్టులు పోస్ట్ చేస్తుంటారు. 

More Telugu News